కరువు సాయం ఎగవేతే!
- రైతన్నకు రేవంత్ సర్కార్ మరోసారి మొండిచెయ్యి
- కరువు సాయంపై తప్పించుకొనే ధోరణిలో సర్కార్
- కేంద్రంపై తోసేసి.. చేతులు దులుపుకొన్న ప్రభుత్వం
- కేంద్రం పైసా ఇచ్చే అవకాశం లేదంటున్న అధికారులు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాతో అన్నదాత ఆగమాగం
- రైతులకు కరువు సాయాన్ని అందిస్తున్న పొరుగు రాష్ర్టాలు
- కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఇప్పటికే ఆర్థిక భరోసా
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచింది. తలాపునే కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా, రాజకీయ కక్షతో ఆ నీళ్లను ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాష్ట్రంలో కరువుకు కారణమైన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు అన్నదాతలకు మరో ధోకానిచ్చింది. ఇప్పటికే సాగునీళ్ల విషయంలో మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కరువు సాయంలోనూ వంచించే దుస్సాహసానికి తెగబడింది.
ఈ మేరకు సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో రైతులకు కరువు సాయం భారాన్ని కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏవేవో రూల్స్ పేరిట రైతులకు ఆశించిన మేర సాయం అందించే అవకాశం లేనేలేదని సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తెలంగాణ రైతులను నట్టేట ముంచేందుకు సిద్ధమైనట్టు అర్థమవుతున్నది.
రూ. 25 వేల కోట్ల మేర నష్టం
సాగునీళ్ల కొరత, కరెంట్ కట్స్‌తో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతులకు రూ.25 వేల కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ, రైతులను ఆదుకొనేందుకు పంటనష్ట పరిహారం చెల్లించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు దీనిపై అధికారికంగా ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. దీంతో పరిహారం ప్రకటన ఎందుకు చేయడంలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పరిహారం బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో జరిగిన చర్చను పలువురు ఉదహరిస్తున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అర్పణమైంది. పంటనష్టంతో రైతాంగం విలవిలలాడుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. బాధిత రైతులకు ఎంత పరిహారం చెల్లించాలి? ఎప్పటిలోగా చెల్లించాలనే విషయాలను మాత్రం ప్రకటించడం లేదు. ఇప్పటికే పెట్టుబడి నష్టపోయి అప్పులపాలై ఆందోళనలో ఉన్న రైతుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అందుకే ప్రకటన లేదా?!
ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న కరువుతో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో, రైతులకు ఎంత నష్టం వాటిల్లిందో లెక్కలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. పంటనష్టం, కరువుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడుసార్లు సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ ఒక్కసారి కూడా రైతులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామనే స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా పాలకుల నుంచి భరోసా లభించడం లేదు. పంటనష్టం వివరాలు సేకరించడం, నివేదికలు తయారుచేయడంతోనే ప్రభుత్వం సరిపెడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా కరువు తేటతెల్లం కావడంతో తొలిదశలో రైతులను ఆదుకొనేందుకు ఎంతోకొంత పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి అంచనాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే పరిహారం ఇతర అంశాల ఆధారంగా పూర్తి పరిహారాన్ని చెల్లించాలి. కానీ, ప్రభుత్వం మాత్రం నయా పైసా పరిహారం చెల్లించేందుకు ముందుకు రావడంలేదు. కనీసం ప్రకటన కూడా చేయడంలేదు. ఒకవేళ ప్రకటన చేస్తే, రైతులకు ఎక్కడ పరిహారం చెల్లించాల్సి వస్తుందేమోననే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అందుకే ప్రకటన చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
కేంద్రంపైనే భారం
ప్రభుత్వ పెద్దల వైఖరి, క్యాబినెట్ భేటీలో జరిగిన చర్చను నిశితంగా పరిశీలిస్తే, పంటనష్టంపై రైతులకు మొండిచేయి చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావం, ఎండల తీవ్రత, సాగునీటి కొరత తదితర కారణాలతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కండ్ల ముందే వాడిపోతుంటే అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుకి దున్నడం, కూలీల ఖర్చుల కోసం చేసిన అప్పులు ఇప్పుడు రైతుల మెడకు ఉరితాళ్లుగా మారుతున్నాయి.
పంట చేతికి రాకపోగా పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొనిపోతున్నాయి. అప్పులు తీర్చడం, కుటుంబాన్ని పోషించడం, వచ్చే సీజన్‌కు పెట్టుబడి సమకూర్చుకోవడం రైతులకు భారంగా మారింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నది. రైతులకు పంటనష్ట పరిహారం భారాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపేసుకుంటున్నది. ఇటీవల రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పరిహారంపై పేర్కొన్న అంశం రైతులకు శాపంగా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నష్ట పరిహారం కింద కనీసం రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్టు పేర్కొన్నది.
అయితే, కేంద్రం నుంచి పరిహారం అందిన నెల రోజుల్లో రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. అంటే పరిహారం భారాన్ని కేంద్రంపై నెట్టేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘కేంద్రం నిధులిస్తే ఇద్దాం.. లేకుంటే ఊరుకుందాం’ అనే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్నారని తెలిసింది. ఇప్పటికే వచ్చే ఆదాయం లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రైతులకు పంటనష్ట పరిహారం ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతున్నది. తొలిదశలో ఎకరానికి కనీసం రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాల్సి వచ్చినా సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తాన్ని సమకూర్చడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని సర్కార్ పెద్దలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కేంద్రం నుంచీ కష్టమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి గమనిస్తే రైతులకు పంటనష్ట పరిహారం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. 17% లోటు వర్ష్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి కేంద్రానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకొనే అవకాశం లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ఇక్కడ మనకు తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువుగా పరిగణించే అవకాశం లేదని చెప్తున్నారు. ఒకవేళ విజ్ఞప్తి చేస్తే ఎంతోకొంత పరిహారం రావొచ్చేమోనని, అయితే, ఆశించిన స్థాయిలో మాత్రం వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాన్ని సదరు అధికారి వ్యక్తంచేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఈ కరువును పరిగణనలోకి తీసుకొనే పరిస్థితులు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలను సాకుగా చూపుతూ చేతులెత్తేయడంతో మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రైతాంగానికి కరువు సాయాన్ని ఎగవేసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొరుగు రాష్ర్టాల్లో ఇలా..
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడిపోతున్న అన్నదాతలను రేవంత్ ప్రభుత్వం ఆదుకొన్న పాపానపోలేదు. అయితే, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎల్‌నినోతో పంటలను కోల్పోయిన రైతులకు అక్కడి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రూ. 5 వేల కరువు సాయాన్ని అందిస్తున్నది. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 305 తాలూకాలను కరువుపీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రానున్నది పండుగల సీజన్. ఈ నేపథ్యంలో కరువుపీడిత తాలూకాల్లోని రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో రైతుకు రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీపావళికి ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికే, ఈ ప్రక్రియ మొదలైనట్టు వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ రైతులకు కరువు సాయంగా రూ. 5 వేలను ఇస్తున్నట్టు సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. తొలి దఫాలో రూ. 2,500ను వెంటనే పంపిణీ చేస్తుండగా, మలిదఫాలో మిగతా మొత్తాన్ని మూడువారాల్లో సర్దుబాటు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక, గుజరాత్‌లోనూ పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు (సుమారు 2.5 ఎకరాలు) రూ. 8,500 చొప్పున సాయం చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించగా, యూపీ, రాజస్థాన్‌లోనూ కరువు సాయంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటనను జారీ చేశాయి. అయితే, రాష్ట్రంలోని అన్నదాతల అరిగోసకు కారణమైన రేవంత్ ప్రభుత్వం మాత్రం కరువు సాయంపై ఎగవేత ధోరణిని ప్రదర్శించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

