వెలుగుల తెలంగాణ మళ్లీ చీకట్లోకి
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం, ఐటీ, సేవలు ఇలా ఏ రంగాన్ని తీసుకొన్నా కావాల్సింది విద్యుత్తు. ఏ రాష్ట్రమైతే మిగులు విద్యుత్తుతో జిగేలుమంటుందో ప్రగతి దానికదే పరుగులు పెడుతుందని నిపుణులు చెప్తారు. అందుకే, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన వెంటనే విద్యుత్తు రంగానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది.
- ఉమ్మడి రాష్ట్రం నాటి కరెంట్ కష్టాలను మళ్లీ తెచ్చిన కాంగ్రెస్
- కిరణ్ కుమార్‌రెడ్డి మాటల్ని నిజంచేస్తున్న నేటి కాంగ్రెస్ సర్కార్
- సాగుకు ఆరేడు గంటల కరెంటే.. ఉదయం 8 నుంచి 4.30 వరకే త్రీఫేజ్
- గృహావసరాలకూ విద్యుత్తు కోతలు.. ఎత్తిపోతలకూ అరకొర సరఫరా
- రేవంత్ సర్కార్ వైఫల్యంతో రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం
(మ్యాకం రవికుమార్) హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం, ఐటీ, సేవలు ఇలా ఏ రంగాన్ని తీసుకొన్నా కావాల్సింది విద్యుత్తు. ఏ రాష్ట్రమైతే మిగులు విద్యుత్తుతో జిగేలుమంటుందో ప్రగతి దానికదే పరుగులు పెడుతుందని నిపుణులు చెప్తారు. అందుకే, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన వెంటనే విద్యుత్తు రంగానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకొని విద్యుత్తు ప్లాంట్లను నిర్మించి, తెలంగాణను గ్రిడ్‌కు అనుసంధానించింది.
భారీ విద్యుత్తు సబ్స్టేషన్లను, కొత్త విద్యుత్తు లైన్లు వేసి రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా 24 గంటల కరెంటు సరఫరాను నిర్విరామంగా అమలు చేసి చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి పరిస్థితులతో పోలిస్తే, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం మరింతగా పెరిగింది. అయినప్పటికీ, ప్రస్తుతం విద్యుత్తు కోతలు మళ్లీ నిత్యకృత్యంగా మారాయి. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఇట్టే అర్థమవుతున్నది.
ఇండ్లల్లో పొద్దుకు పదిసార్లు కటింగ్‌లు
రైతులకే కాదు గృహ వినియోగదారులకూ విద్యుత్తు కోతలు తప్పడం లేదు. పల్లె, పట్టణం.. పగలు, రాత్రి.. అనే తేడా లేకుండా పొద్దుకు పది సార్లు కరెంట్ కటింగ్‌లు పరిపాటిగా మారాయి. కేసీఆర్ పాలనలో ఇండ్లకు సైతం 24 గంటల విద్యుత్తు సరఫరా చేశారు. మరమ్మతుల కోసం తప్ప ఏనాడూ రెప్పపాటు కాలం కరెంట్ పోయింది లేదు. మరమ్మతుల సమయంలోనూ ముందస్తు ప్రకటన ద్వారా వినియోగదారులకు కచ్చితమైన సమాచారమిచ్చి, తక్కువ సమయంలోనే రిపేర్లు పూర్తిచేసేవారు.
కానీ ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. రాత్రిపూట కూడా పలు సందర్భాల్లో కట్ చేస్తుండటంతో గృహిణులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోవోల్టేజీ వల్ల ఇండ్లల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయి. తద్వారా సామాన్యులు ఆర్థికంగానూ నష్టపోతున్నారు. మరోవైపు పరిశ్రమలకు అందిస్తున్న కరెంటులో 30 శాతం సరఫరాకు కోత విధించినట్టు తెలుస్తున్నది. తద్వారా ఉత్పాదకతపై ప్రభావం పడుతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏమిటని పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతల పథకాలకూ ఆరేడు గంటలే
తెలంగాణ సాగునీటి రంగం ప్రధానంగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి కొనసాగుతున్నది. ఏడాదిలో 90 నుంచి గరిష్ఠంగా 180 రోజుల వరకు మాత్రమే పంపులు పనిచేస్తాయి. నీటి వనరుల్లో వరద ప్రవాహాలు కొనసాగిన సమయంలోనే ఇవి నిరంతరాయంగా పనిచేయాలి. అప్పుడే ఆయా రిజర్వాయర్లను నింపే అవకాశముంటుంది. ఇది జరుగాలంటే నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలి. అప్పుడే సామర్థ్యం, నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని ఎత్తిపోసుకోవడం సాధ్యపడుతుంది. పంపింగ్ చేయాల్సిన నీటి పరిమాణం, పంపుల సామర్థ్యం, సంఖ్య కారణంగా, చివరి ఆయకట్టు వరకూ అవసరమైన నీటిని అందించాలంటే అందుకు 24 గంటలు పంపింగ్ అత్యావశ్యకం.

09
కానీ రేవంత్ ప్రభుత్వం ఈ లిఫ్ట్ స్కీమ్‌లకు సైతం ఉదయం పూటనే.. అదీ కోతలు విధిస్తూ కరెంటును సరఫరా చేస్తున్నది. కొరతను సాకుగా చూపుతూ కరెంటు ఇవ్వబోమని ట్రాన్స్‌కో విభాగం ఇరిగేషన్ శాఖకు తెగేసి చెప్పడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఆరేడు గంటలు, అదీ సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే సమయంలో మాత్రమే ఇస్తామని షరతులు కూడా విధించింది. వెరసి ప్రాజెక్టుల్లో పంపులను సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆన్ అండ్ ఆఫ్ విధానంలోనే పంపింగ్ చేయిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉన్నా ఎత్తిపోతల పథకాలు నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని ఎత్తిపోయడం లేదు. ఫలితంగా సాగునీరందక పలుచోట్ల పొట్ట దశలోకి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఆన్ అండ్ ఆఫ్ విధానం వల్ల భారీ రేటింగ్ కలిగిన పంపులు సైతం దెబ్బతింటున్నాయి.
నామమాత్రంగా విద్యుదుత్పత్తి.. కొనుగోళ్లు
గత కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్తు డిమాండ్‌పై నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగేది. ఎంతమేరకు అవసరం.. లోటు ఉన్నదా? లేదా? ఉంటే ఎంత? ఎక్కడ? ఎప్పుడు కొనుగోలు చేయాలి? అనే అంశాలపై కచ్చితమైన ప్రణాళిక ఉండేది. అంచనాలు ఉండేవి. తద్వారా విద్యుత్తు డిమాండ్ మేరకు సప్లయ్‌ను మెయింటేన్ చేసేది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్తు లోటున్న సందర్భంలోనూ పలు ప్లాంట్లలోని కొన్ని యూనిట్లు షట్డౌన్లో ఉండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అందుకు కారణం సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడమేనని తెలుస్తున్నది. అదేవిధంగా బహిరంగ మార్కెట్ నుంచి కూడా డిమాండ్ మేరకు విద్యుత్తును కొనుగోలు చేయని స్థితి నెలకొన్నది. డిమాండ్, సరఫరా అంశంపై కనీస అంచనాలు లేకపోవడమే కోతలకు కారణమవుతున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనాలోచిత విధానాలు.. అస్థిరమైన అధికారులు
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభానికి పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణమని తెలుస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంధనశాఖ నిర్వహణను నిష్ణాతులైన సాంకేతిక నిపుణులకే అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం టెక్నోక్రాట్లను తప్పించి బ్యూరోక్రాట్లకు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్తు రంగంపై పూర్తి అవగాహనకు ముందే ఉన్నతాధికారులను సైతం తరుచూ బదిలీ చేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇంధన శాఖ కార్యదర్శిగా మొదట రిజ్వి ఉండగా, కొద్దికాలంలోనే ఆయన స్థానంలో.. రొనాల్డ్‌రాస్‌ను, ఆ తర్వాత సుల్తానియాను, ప్రస్తుతం నవీన్‌మిట్టల్‌ను నియమించింది. మూడేండ్లు తిరుగకముందే నలుగురు అధికారులు మారారు.
అదేవిధంగా సీఎండీలను సైతం మార్చింది. ఇక సీఎండీలు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లను సైతం ఇష్టారీతిన నియమిస్తున్నది. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే రెడ్కో వీసీ, ఎండీగా ఓ సాధారణ డీఈని(డివిజనల్ ఇంజినీర్) ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత తొలగించి వీసీ అండ్ ఎండీగా ముషారఫ్‌ను నియమించారు. రెడ్కో చైర్మన్‌గా ఒక మహిళను నియమించిన ప్రభుత్వం ఆమెను తొలగించి, ఆ తర్వాత విశ్రాంత ఐఏఎస్ శరత్‌ను నియమించింది. నెలలు తిరుగకముందే ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పటికీ చైర్మన్‌గా ఎవరినీ నియమించకపోవడంతో విద్యుత్తు వ్యవస్థ గాడి తప్పింది.
అతీగతీ లేని ప్లాంట్లు
రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం కోసం డీపీఆర్, క్యాబినెట్ అప్రూవల్ పూర్తయినా ఇప్పటికీ ఎన్టీపీసీకా? లేక జెన్కోకు ఇవ్వాలో ప్రభుత్వం తేల్చకుండా మూలన పడేసింది. పాల్వంచలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌కు సరిపడా స్థలం, బొగ్గు ఉన్నా నిర్మించడం లేదు. కానీ ఎలాంటి బొగ్గు గనులు లేని మక్తల్‌లో పిట్‌హెడ్ ప్లాంట్ల నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయినప్పటికీ, దానికీ అతీగతీ లేదు. దేశవ్యాప్తంగా అన్ని జెన్కోలు సోలార్ పవర్‌పై దృష్టిపెడితే ఇక్కడ మాత్రం ఆ దిశగా అడుగులు వేసింది లేదు.
రాష్ట్రంలో తొలి సోలార్ ప్లాంట్‌ను అదీ 2 మెగావాట్ల అత్యల్ప సామర్థ్యంతో మాత్రమే జూరాలలో నెలకొల్పారు. ఇప్పటికీ మళ్లీ ఏవీ ఏర్పాటు చేయలేదు. ఇక కేంద్రం బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లకు వీజీఎఫ్(వయబులిటీ గ్యాప్ ఫండ్)ను సమకూర్చగా, ఆ పనులను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టింది. పీఎం కుసుమ్ కింద 1,800 మెగావాట్ల ప్లాంట్లు మంజూరైతే ఇప్పటివరకూ 107 మెగావాట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. విద్యుత్తు అవసరాలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉందో ఈ విషయాలే తేటతెల్లం చేస్తున్నాయి.
సీన్-1
మీకు గుర్తుందా? 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ విద్యుత్తుకు సంబంధించి వ్యంగ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటి మయమవుతుంది. తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటుంది. అక్కడ విద్యుత్తు ప్లాంట్లు లేవు. ఉచిత విద్యుత్తు కాదు కదా.. కనీసం రోజుకు 3 నుంచి 4 గంటల కరెంటు సరఫరా కూడా జరుగదు. నా మాటలు వినకుండా ముందుకెళ్తే, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందం’టూ వెక్కిరించారు.
సీన్-2
కిరణ్ కుమార్ వ్యాఖ్యలపై అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ‘తెలంగాణలోస్థాపితవిద్యుత్తు సామర్థ్యం 4,825 మెగావాట్లు. కేంద్ర గ్రిడ్ నుంచి 1,260 మెగావాట్లు వస్తున్నది. థర్మల్ పవర్ నుంచి 2,282 మెగావాట్లు స్థాపిత సామర్థ్యం ఉన్నది. జల విద్యుత్తు ద్వారా 2,541 మెగావాట్లు అందుబాటులో ఉంటుంది.
తెలంగాణలో నికర విద్యుత్తు వినియోగం 6,800 మెగావాట్లుగా ఉన్నది. కేవలం 2,458 మెగావాట్ల లోటు మాత్రమే ఉంటుంది. జూరాల, సింగరేణి, భూపాలపల్లి తదితరాల ద్వారా విద్యుత్తు కొరతను తీర్చుకుంటాం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించని 10 శాతం విద్యుత్తు ఉంటుంది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్ వద్ద అదనంగా విద్యుత్తు ఉన్నది. డబ్బులిచ్చి కొనుగోలు చేస్తాం’ అంటూ చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చీరాగానే విద్యుత్తు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. 24 గంటల కరెంటిస్తూ, తొమ్మిదిన్నరేడ్లు రాష్ర్టాన్ని వెలుగులమయం చేశారు.
వ్యవసాయానికి ఆరేడు గంటలే
కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆరేడు గంటలకు మించి ఇవ్వడం లేదు. త్రీఫేజ్ విద్యుత్తును తొలుత ఉదయం పూట 7గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకే కుదించారు. ప్రస్తుతం అదీ పోయింది. ఉదయం 8 గంటల నుంచి మాత్రమే సరఫరా చేస్తున్నారు. అదీ నిరంతరాయంగా సరఫరా చేస్తున్న పరిస్థితి కూడా లేకుండా పోయింది. మధ్యలో ఒకట్రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు.
సాయంత్రం 4.30 గంటలు అయ్యిందంటే పూర్తిగా నిలిపేస్తున్నారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అదీగాక తరుచూ కోతలు విధించడం వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్న పరిస్థితి దాపురించింది. దీంతో మడులు సైతం తడువడం లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. అంతేగాక ప్రభుత్వం పరిమిత సమయంలో కరెంట్ ఇవ్వడంతో రైతులందరూ ఒకే సమయంలో మోటర్లు ఆన్ చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై భారం పడటం, అవి కాలిపోవడం సైతం పరిపాటిగా మారింది. కరెంట్ లేక పంటలు ఎండిపోతుండటంతో రైతన్నలు మళ్లీ జనరేటర్లపై ఆధారపడి సాగుచేస్తున్న పరిస్థితి దాపురించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

