భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/పాల్వంచ: అప్పుల బాధతోపాటు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంలో ఓ కుటుంబం ఆత్మాహుతికి పాల్పడింది. కుటుంబ పెద్ద.. తనతోపాటు భార్యాబిడ్డలపై పెట్రోలు పోసి గ్యాస్ లీక్‌చేసి నిప్పు అంటించడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్న కుమార్తె ప్రాణాపాయస్థితిలో దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ (45) పట్టణంలోని నవభారత్ సెంటర్లో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. మూడునెలల క్రితం షాపును విక్రయించాడు. రామకృష్ణ తండ్రి ఈ మధ్య చనిపోయారు. తల్లి రామకృష్ణ వద్దనే ఉంటున్నది. తమకు చెందిన ఆస్తిని పంచాలని తల్లిని రామకృష్ణ కోరాడు. తాను అప్పుల ఊబిలో ఉన్నానని, తనకు ఆస్తి ఇవ్వాలని అడిగాడు. దీంతో తల్లి సూర్యావతి ఈ విషయంపై ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్రావును సంప్రదించారు.
ఆస్తుల పంపకాల్లో తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవికి అనుకూలంగా వనమా రాఘవేందర్రావు వ్యవహరించారని ఆరోపిస్తూ రామకృష్ణ మనస్తాపం చెందాడు. మూడునెలల క్రితం రామకృష్ణ పాత పాల్వంచ నుంచి రాజమండ్రికి వెళ్లి వ్యాపారం చేస్తున్నాడు. ఆస్తి పంపకంలో తనకు అన్యాయం జరిగిందని తరచూ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో శనివారం రాజమండ్రి నుంచి కుటుంబాన్ని పాల్వంచకు తీసుకొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున తనతోపాటు భార్య శ్రీలక్ష్మి (40), పెద్ద కుమార్తె సాహిత్య (13)పై పెట్రోల్ చల్లుకొని ఇంట్లోని గ్యాస్ లీక్ చేసుకొని నిప్పంటించుకున్నారు.
చిన్న కుమార్తె సాహితి ఒంటిపై చల్లగా అనిపించడంతో కండ్లు తెరిచి చూసేలోపు తండ్రి నిప్పంటించుకోవడంతో కేకలువేస్తూ బయటికి పరుగులు తీసింది. చుట్టుపక్కలవారు చూసి మంటలను అదుపు చేసేలోపే ముగ్గురు సజీవ దహనమయ్యారు. ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. తీవ్రంగా గాయపడిన సాహితి దవాఖానలో చికిత్స పొందుతున్నది. పక్కా ప్రణాళిక ప్రకారమే రామకృష్ణ పెట్రోల్ తీసుకొచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏఎస్పీ తెలిపారు.
కారులో సూసైడ్ నోట్ లభ్యం
ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రోహిత్‌రాజు, సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రవీణ్ సందర్శించారు. రామకృష్ణ కారును తెరిచి చూడగా పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తమ మృతికి ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేందర్రావు ప్రధాన కారకుడని, తన తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవి కూడా కారకులేనని రామకృష్ణ సూసైడ్ నోట్లో రాశాడు. రాఘవేందర్‌రావుకు తన అక్కతో వివాహేతర సంబంధం ఉండటంతో ఆస్తి పంపకం విషయంలో తనకు అన్యాయం చేశారని నోట్లో పేర్కొన్నాడు. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు, చిన్నారి సాహితి చెప్పిన ఆధారాల మేరకు రాఘవేందర్రావు, మృతుడి తల్లి, అక్కలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ వెల్లడించారు.
అమ్మను బాగా చూసుకోమని చెప్పా..
కుటుంబం ఆత్మాహుతి ఘటనపై ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్రావు స్పందించారు. ‘మా కుటుంబంపై రాజకీయ కుట్ర జరుగుతున్నది. రామకృష్ణ కుటుంబం సజీవ దహనంతో నాకు సంబంధం లేదు. రామకృష్ణ అప్పుల బాధతో చనిపోయాడు. నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా కొందరు కుట్ర పన్నారు. మా ఇంటికి ఎంతో మంది ఎన్నో రకాల సమస్యల పరిష్కారం కోసం వస్తారు.
అలాంటి సమస్యల్లో రామకృష్ణ సమస్య ఒకటి. అతడిని పిలిచి అమ్మను బాగా చూసుకో అని చెప్పా. నేను రామకృష్ణను ఏమీ అనలేదు. సూసైడ్ నోట్లో నా పేరు ఎందుకు రాశాడో తెలియదు. గతంలోనూ నాపై చాలా కేసులు పెట్టారు. అవేమీ నిలబడలేదు. తప్పుడు కేసులు పెడితే నేను భయపడను. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం.’ అని వివరణ ఇచ్చారు.