TCHE | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఉన్నతవిద్య కరిక్యులాన్ని సమగ్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇందుకు కసరత్తును వేగవంతం చేసింది. పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాలను సిలబస్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో బీకాం, లా కోర్సులకు కమిటీని నియమించారు.
ఇక సైన్స్ కోర్సులకు ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఎస్కే మహమూద్, ఆర్ట్స్ కోర్సులకు మరో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్ ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. ఈ స్టీరింగ్ కమిటీలు త్వరలోనే వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) చైర్మన్లతో సంప్రదింపులు జరిపి, అవసరమైన మార్పులపై చర్చిస్తాయి. శుక్రవారం సైన్స్ కోర్సుల కరిక్యులం, సిలబస్ రూపకల్పనపై సంప్రదింపులు జరపనున్నారు. ఇలా ఆయా సజ్టెకులపై స్టీరింగ్ కమిటీలు వరుసగా సంప్రదింపులు జరపనున్నాయి.