హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి, క్యాబినెట్ మంత్రుల మధ్య వాడీవేడి చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. మూసీ తొలి దశ పనులను యుద్ధప్రాతిపతికన పూర్తిచేసిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన నేపథ్యంలో మంత్రులు ఘాటుగా స్పందించింనట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మూసీ ఎజెండా పెట్టడమూ సరైన నిర్ణయం కాదని సీనియర్ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. మూసీ మొదటి ఫేజ్ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అంశంపై క్యాబినెట్లో చర్చ జరిగింది.
రూ.7,345 కోట్లతో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈసా నుంచి మూసీ ప్రవాహం ప్రారంభమయ్యే స్థలం నుంచి బాపూఘాట్ వరకు తొలిదశ పనులు చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదించింది. పనులు చేయడం మాత్రమే కాదని, మూసీలోకి నీళ్లు వదిలినప్పుడే దాని ఫలితం కనిపిస్తుందని, ఇప్పటికిప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మూసీలోకి వదులుతారని సదరు మంత్రి అన్నట్టు తెలిసింది. గోదావరి జలాలతో నింపడమంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి మన గోతి మనమే తవ్వుకొన్నట్టు అవుతుందని అన్నట్టు తెలిసింది. పనికిరాని ప్రాజెక్టు అని చెప్పకొంటూ ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎలా తీసుకొద్దామని మంత్రి అన్నట్టు తెలిసింది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల కవ్వింపు ట్రాప్‌లో పడిపోయామని, అవసరంలేని చోట సవాళ్లను స్వీకరించి ప్రజల ముందు పరువు పోగొట్టుకొన్నామని తోటి మంత్రులు అభిప్రాయపడ్టట్టు తెలిసింది. ప్రణాళిక లేకుండా ప్రతిస్పందించి పూర్తిగా ఇరుక్కుపోయామని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ దెబ్బతో రూ.5వేల కోట్ల రైతుభరోసా నిధులు బూడిదలో పోసినట్టయిందని, పథకంపై చర్చ జరుగకుండా ఈ పంచాయితీయే ముందు పడ్డదని ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. వారం, పది రోజులు గడిచిపోతే రైతుభరోసా విషయమే మరచిపోయి కరువుపై ప్రజలు మాట్లాడుకొంటారని మంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. హరీశ్‌రావు వేసిన ట్రాప్‌లో పడిపోయారని పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి సీఎం అన్నట్టు తెలిసింది. తెలంగాణ భవన్‌కు వెళ్తామని చెప్పడం కూడా సరైన ఆలోచన కాదని అన్నట్టు తెలిసింది.