‘సాంకేతిక ప్రపంచాన్ని మార్చడానికి నేనొక్కడినే సరిపోను. నాలాంటి వాళ్లు చాలామంది కావాలి’ అంటారు అంతరిక్ష ఆంత్రప్రెన్యూర్ ఎలన్ మస్క్. తనలాంటి సృజనాత్మక జీవులను తయారు చేయడానికి ఏకంగా ఓ పాఠశాలను ప్రారంభించారు ఆయన. తెలంగాణ బిడ్డ అనిక్‌పాల్ ప్రపంచ బాలలతో పోటీపడి ఆ బడిలో సీటు సంపాదించాడు.
అనిక్‌పాల్‌ను బాల మేధావి అంటారో, మట్టిలో మాణిక్యమని మెచ్చుకుంటారో మీ ఇష్టం. కానీ, తను ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ ఆంత్రప్రెన్యూర్, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ బడిలో సీటు సంపాదించాడు. త్వరలో కాలిఫోర్నియాలోని సింథసిస్ స్కూల్లో టెక్నాలజీ పాఠాలు వినబోతున్నాడు. పరకాలకు చెందిన రేణుకుంట్ల విజయ్‌పాల్-సృజన దంపతులు హనుమకొండ గోపాల్‌పూర్‌లో ఉంటారు. విజయ్‌పాల్ జనగామ జిల్లా తుమ్మడపల్లి ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు. సృజన గృహిణి. ఆ దంపతుల పెద్ద కొడుకు అద్విక్పాల్ ఏడో తరగతి. చిన్న కొడుకు అనిక్‌పాల్ నిట్ సమీపంలోని ప్రభుత్వ ఆర్యీసీ పాటక్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అనిక్కు వీడియోగేమ్స్ అంటే ప్రాణం. ‘ఆటదేముంది ఎవరైనా ఆడుతారు. అసలు ఆ ఆటను ఎలా రూపొందించారో ఆలోచించు’ అంటూ ఓ సవాలు విసిరాడు తండ్రి. దీంతో పసివాడి ఆలోచనా ధోరణి మారిపోయింది. సాంకేతిక అన్వేషణలో కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- మేకింగ్ అండ్ లెర్నింగ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాడు. అబాకస్, వేదగణితం, రూబిక్ క్యూబ్, మెమరీ టెక్నిక్.. నిత్యం ఏదో ఒకటి సాధన చేస్తాడు.
ఎంపిక ఎలా?
ఓసారి యాదృచ్ఛికంగా ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి గూగుల్‌లో చూశారు విజయ్. ఆ బోధన విధానం అద్భుతంగా అనిపించింది. సింథసిస్ స్కూల్.. ఇరవై ఒకటో శతాబ్దపు బడి. అక్కడ ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు. సృజనను గుండెలకు హత్తుకుంటారు. ఆవిష్కర్తలకు అగ్రస్థానం ఇస్తారు. తన చిన్న కుమారుడిని ఆ స్కూల్లో చేర్పించాలన్న సంకల్పం కలిగింది అతనికి. అందుకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చారు. నైపుణ్యాలు నేర్పించారు. గతంలో ‘స్పేస్ఎక్స్’ కంపెనీ సిబ్బంది పిల్లలకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రతిభ కలిగిన ఎవరైనా పోటీపడవచ్చు. ఆ సడలింపే అనిక్‌పాల్‌కు కలిసొచ్చింది. మూడు దశల వడపోతను దాటుకుని ముందు వరుసకు చేరుకున్నాడు. ఆరో తరగతిలో ప్రవేశం లభించింది. ఫీజు భారతీయ కరెన్సీలో నెలకు పద్నాలుగు వేల రూపాయలు. ‘మా బాబుకు కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ పట్ల ఆసక్తి ఉండటంతో ఎలన్ మస్క్ పాఠశాలలో అయితేనే తన ప్రతిభ వికసిస్తుందని భావించాను. ఆ వైపుగా ప్రోత్సహించాను’ అంటారు విజయ్‌కుమార్. అంతరిక్ష శాస్త్రవేత్త కావడమే అనిక్‌పాల్ జీవిత లక్ష్యం. ‘అంగారక గ్రహం గురించి లోతైన పరిశోధన చేస్తా. నా ఆవిష్కరణలతో మానవాళికి మంచి చేస్తా’ అంటున్నాడు అనిక్. తథాస్తు!