హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20: స్థానిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం మొదలైంది. పోటీలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రతి పాఠశాలలో మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని అన్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 20 జిల్లాల నుంచి 90 జట్లు పోటీపడుతున్నాయి. పురుషుల డబుల్స్, పురుషుల 40 ప్లస్, 50 ప్లస్ విభాగాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీలు ప్రకాశ్, సారయ్య, ఎమ్మెల్యేలునరేంద ర్, ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, మేయర్ సుధారాణి, జిల్లా బ్యాడ్మింటన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.