Elections Results Live Updates |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీర్పునకు వేళ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకుగానూ ఆదివారం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేస్తున్నా. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. అత్యధిక పోలింగ్ కేంద్రాలు, ఎక్కువ ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఫలితం ఆలస్యం అయ్యే చాన్స్ ఉన్నది. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
తెలంగాణలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు తెలంగాణ గవర్నర్ తమిళ సైని కలిసినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో 65 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళసైతో భేటీ తర్వాత డీకే శివ కుమార్ మీడియాకు చెప్పారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రావడానికి ఆలస్యమవుతుందన్నారు. సోమవారం ఉదయానికల్లా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకుంటారన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశమై తమ నాయకుడ్ని ఎన్నుకుంటుందన్నారు. దీనిపై తమ పార్టీ అంతర్గత ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ గవర్నర్‌ను కలుస్తామన్నారు. సోమవారం సీఎం ప్రమాణ స్వీకారం ఉండదని చెప్పారు. ఆ ప్రచారం ఫేక్ అని శివ కుమార్ చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మ దినోత్సవం డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా ప్రణాళిక రూపొందించారు. కానీ సోమవారం సీఎల్పీ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
సోమవారం సీఎల్పీ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ఆదివారం రాత్రి గవర్నర్ తమిళ సైతో సమావేశమై తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
సోమవారం సాయంత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ సీఎల్పీ నేతగా ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో సీఎల్పీ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర గవర్నర్ తమిళ సైకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. సోమవారం కొత్త తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభా పక్ష నేతను (సీఎల్పీ) ను ఎన్నుకుంటారు. సీఎల్పీ నాయకుడిని సీఎంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎంగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళ సై.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయ పథాన నడిపించిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి తదుపరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అనుముల రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళ సై ప్రమాణం చేయిస్తారని సమాచారం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని సమాచారం. ఈ మేరకు రాజ్‌భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం అవుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
తెలంగాణ సీఎం ఎవరన్న విషయమై ఏఐసీసీలో ఎటువంటి నిర్ణయం జరుగలేదని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ, హూజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన మనస్సులో మాట తాను బయట పెట్టనని చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుచేస్తామని గవర్నర్ తమిళ సైకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వనున్నది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరిన వారిలో ఉన్నారు.
తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి.. ఎన్నికల ఫలితాలు వెల్లడించక ముందే టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిని డీజీపీ అంజినీ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఆగ్రహించిన ఈసీ.. ఆయనన్ను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీని ముందు ఉండి నడిపించిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి నిరాశ కల్పించినా గుణపాఠం నేర్చుకుంటాం అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో గడపగడపకూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ పేదల గొంతుకగా నిలుస్తామని చెప్పారు.
గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనను ప్రజలు తిరస్కరించారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేతి వీరభద్రం పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వంతో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు.
ఆదివారం రాత్రి పది గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. తొలుత బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో జరుగాల్సిన సమావేశాన్ని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు మార్చారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు హైదరాబాద్ నగరానికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సీఎల్పీ సమావేశం ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
తెలంగాణ సీఎంగా కేసీఆర్ చేసిన రాజీనామాను గవర్నర్ తమిళసై ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో ఓఎస్డీ ద్వారా తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ పంపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే, సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికవ్వక ముందే ఆయన నివాసం వద్ద పోలీసు భద్రత పెంచారు. పోలీసులే ఆయన నివాసానికి వచ్చి వెళ్లే వారిని నియంత్రిస్తున్నారు. బ్యారికేడ్లు కూడా పెంచారు.
గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారితో సీఎల్పీ సమావేశం ఏర్పాటు కానున్నది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్ వద్దకు చేరుకోనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులను, కారణాలను విశ్లేషించుకుంటామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కోల్పోయామో అక్కడే తెచ్చుకుంటాం.. స్వల్ప తేడాతో మా అభ్యర్థులు చాలా మంది ఓడిపోయారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు కూడా కుదురుకోవాలని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే పొంగిపోవడం, ఓటమి పాలైతే కుంగిపోవడం సరి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ వంద శాతం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జనసేనకు ఒక మైలురాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలుపుకుంటారని ఆశిస్తున్నానని ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం గవర్నర్‌కు సీఎం కేసీఆర్ రాజీనామా లేఖ పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. దాంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. ఆశించిన ఫలితం రానందుకు బాధగా ఉందని, అయినా కుంగిపోమని అన్నారు.
మరికాసేపట్లో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం గచ్చిబౌలిలోని ఒక హోట్‌లో జరుగనుంది. ఈ సమావేశం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గచ్చిబౌలికి బయలుదేరారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మరికొన్ని నిమిషాల్లో అక్కడికి చేరుకోనున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 40, 590 మెజార్టీతో విజయం సాధించారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జగ్గా రెడ్డిపై 8,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలిచారు. 50,281 ఓట్ల మెజారిటీతో సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమౌతు భాస్కర్ రావుపై గెలుపొందారు.
రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. బిజెపి అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిపై ప్రకాష్ గౌడ్ 31,844 ఓట్లతో విజయం సాధించారు.
తన గెలుపు సనత్ నగర్(Sanathnagar) నియోజకవర్గ ప్రజల విజయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును స్వాగతిస్తామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. 50,130 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ భారీ మెజారిటీతో గువ్వలపై గెలుపొందారు. చివరి 20వ రౌండ్ ముగిసేసరికి 48,100 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ 1,026 ఓట్ల ఆధిక్యంతో కలిపి 49,326 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.
ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్కటి మినహా కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని స్థానాల్లో జెండా ఎగురవేసింది. దీంతో రాష్ట్రంలో కూడా ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరు ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ రావు వరంగల్ ఈస్ట్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.
అయితే, ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగిన దయాకర్‌రావు అల్లుడు మధన్ మోహన్‌రావు మాత్రం విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అనూహ్యం కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆయన సోదరుడు ప్రదీప్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆదివారం రాత్రి సమావేశం కానున్నారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రానికి తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండు చేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తికాకముందే అంజనీ కుమార్.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు. అంతేకాదు రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించాడు. అంజనీ కుమార్ ఎన్నికల నిబంధనలను ఉల్లఘించడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ సస్పెన్షన్ విధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉప ఎన్నిక (by elections)కు ఛాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) ప్రతి ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతుంటారన్న విషయం తెలిసిందే. ఈసారి గజ్వేల్‌తోపాటూ కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం తాను పోటీ చేసే కొడంగల్ నియోజకవర్గంతోపాటు.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేశాడు. అయితే గజ్వేల్‌లో కేసీఆర్, కొడంగల్‌లో రేవంత్ గెలుపొందినప్పటికీ.. కామారెడ్డిలో మాత్రం ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు.
ఒక వేళ తమ సొంత నియోజకవర్గంతోపాటు కామారెడ్డిలో కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుపొంది ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉండేది. అయితే ప్రజలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ ఇద్దరికీ వ్యతిరేకంగా ఓటు వేసి.. ఉప ఎన్నిక అవసరం లేకుండా చేశారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 2 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీజేపీ అభ్యర్థి రీ- కౌంటింగ్ జరపాలని ఎన్నికల అధికారులను డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు. సొంత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా ఈటల పోటీ చేశారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్ ఓడిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశం సోమవారం జరుగనున్నది. సోమవారం సాయంత్రానికి తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
సీఎల్పీ సమావేశం అనంతరం సీఎంగా ఎంపికైన అభ్యర్థి ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ సభాస్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సైని కలిసిన కేసీఆర్ తన రాజీనామా లేఖ అందించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈసారి కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానమైన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో 6వేల పైచిలుకు ఓట్ల తేడాతో కేసీఆర్ ఓటమి పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు దఫాలు ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసిన ఉద్యమ నాయకుడిగా పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు.
ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పోలుసులు గట్టి భద్రత కల్పించనున్నారు. ఒక్కొక్కరికి 2+2 గన్మెన్లను కేటాయించాలని సీపీని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారని, ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
నేడు రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించామన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారని, ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కౌంటింగ్ నిలిచిపోయింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత వాహనంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ తమిళి సైని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.
పరిగిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. తమ సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డిపై 22, 481 మెజారిటీతో గెలుపొందారు.
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై 8,472 ఓట్లతో గెలుపొందారు.
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుపై 34,765 ఓట్ల ఆదిత్యంతో విజయం నమోదు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ వెళ్లనున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఆయన గవర్నర్ తమిళి సైని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రెండు దఫాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణను పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.