హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను అడ్వెంచర్, ఏరో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. లండన్, న్యూయార్క్, పారిస్, సిడ్నీ, మెల్బోర్న్ లాంటి నగరాల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో తెలంగాణను చేర్చేందుకు అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.
బ్రెజిల్లో జరుగనున్న11వ ఎఫ్ఏఐ ప్రపంచ పారా మోటార్ చాంపియన్‌షిప్-2022కు ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన సుకుమార్ దాస్‌ను మంగళవారం మంత్రి అభినందించారు. తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా భేటీలో మంత్రి మాట్లాడారు. 30 దేశాలకు చెందిన 150 మంది అడ్వెంచర్ పైలెట్లు పాల్గొనే టోర్నీలో సుకుమార్ ఎంపికవడం గర్వకారణం అన్నారు. పారా మోటరింగ్‌కు అనువైన వాతావరణం ఉన్న మహబూబ్‌నగర్ పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 20 ఎకరాల్లో ఏరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు.