హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పండించిన పంటను తానే అమ్మి రెండింతల లాభం ఆర్జిస్తున్నారు నల్లగొండ జిల్లా హాలియా మండలం పెద్దగూడెం రైతు పోశం వెంకటరెడ్డి. రెండెకరాల భూమిలో జామ తోట వేసిన ఆయన.. గంపగుత్తగా వ్యాపారులకు అమ్ముదామనుకొన్నారు. కానీ, వ్యాపారులు కిలో రూ.15 కు మించి ఇచ్చేది లేదనటంతో.. తానే ఓ తోపుడు బండిని పెట్టుకొన్నారు. హాలియా-పెద్దవూర హైవేపైన పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద కిలో జామ పండ్లు రూ.40 కి అమ్ముతున్నారు.
ఆయనకు దాతృత్వం కూడా ఎక్కువే. పేదోళ్లు వస్తే రూ.5-10 తగ్గించి విక్రయిస్తున్నారు. రోజుకు 40-50 కిలోలు అమ్ముతున్నట్టు ఆయన తెలిపారు. జామ తోటలో కోళ్లను కూడా పెంచుతున్న ఈయన.. వాటి వ్యర్థాలను ఎరువుగా వాడుతున్నారు. దీంతో మంచి దిగుబడి వస్తున్నదని వివరించారు. పండించిన పంటను వ్యాపారులకు అమ్మేబదులు తామే స్వయంగా అమ్ముకోగలిగితే వ్యవసాయం పండుగ అవుతుందని ఆయన చెప్తున్నారు.