ప్రతిష్ఠాత్మక డెఫ్ ఒలింపిక్స్ షూటింగ్లో పసిడి పతకం సాధించిన తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్‌తో పాటు కోచ్ గగన్ నారంగ్‌కు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్‌లో దేశం గర్వపడేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక డెఫ్ ఒలింపిక్స్‌లో తెలంగాణ యువ తేజం ధనుశ్ శ్రీకాంత్ సత్తాచాటాడు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో శ్రీకాంత్ పసిడి పతకంతో మెరిశాడు. బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్ పోరులో ఈ హైదరాబాదీ యంగ్ గన్ 247.5 పాయింట్లతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ కిమ్ వు రిమ్(కొరియా, 246.6), శౌర్య సైనీ(భారత్, 224.3) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగిన తొలిసారే డెఫ్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే తనదైన జోరు కనబరిచిన శ్రీకాంత్..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. ఆదిలో ఒకింత తడబడ్డా..ఆ తర్వాత పుంజుకుని కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.
రెగ్యులర్ షూటింగ్ టోర్నీల్లో పోటీపడుతూ తాను ఎందులోనూ మిగతా షూటర్లకు తీసిపోనని నిరూపించడంలో శ్రీకాంత్ మరోమారు సఫలమయ్యాడు. డెఫ్ ఒలింపిక్స్‌లో ధనుశ్ పసిడి ప్రదర్శనపై తల్లిదండ్రులు శ్రీకాంత్, ఆశ స్పందించారు. ‘చాలా సంతోషంగా ఉంది. అతని అద్భుత ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. వాస్తవానికి డెఫ్ ఒలింపిక్స్‌లో ధనుశ్‌ను పోటీకి పంపవద్దు అనుకున్నాం.
రెగ్యులర్ టోర్నీల్లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో మరింత అనుభవం కోసం ఈ ప్రతిష్ఠాత్మక చాంపియన్‌షిప్‌నకు పంపాం. కచ్చితంగా పతకం గెలుస్తాడని ముందే అనుకున్నాం. ఈ విభాగంలో ధనుశ్కు ఇది తొలి పతకం. ఈనెల 27 నుంచి బాకు వేదికగా మొదలవుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడు. రానున్న పారిస్ (2024) ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే అతని లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.
ధనుశ్ శ్రీకాంత్ గురువుకు తగ్గ శిష్యుడు అనిపించాడు. లండన్ (2012) ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హైదరాబాదీ ఏస్ షూటర్ గగన్ నారంగ్ దగ్గర 2016 నుంచి శ్రీకాంత్ శిక్షణ తీసుకుంటున్నాడు. వినికిడి సమస్య ఉన్నా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని శ్రీకాంత్.. సహచర షూటర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతున్నాడు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ పతకాలు కొల్లగొడుతున్నాడు. ‘షూటింగ్ పట్ల ధనుశ్కు మెండైన ఆసక్తి ఉంది. చిన్నతనం నుంచి అతని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తు వస్తున్నారు. గతంలోనూ ప్రపంచస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇలాంటి పతక ప్రదర్శన శ్రీకాంత్‌కు చాలా ఉపయోగపడుతుంది’అని నారంగ్ అన్నాడు.