మేడ్చల్ రూరల్, నవంబర్ 22: మల్లారెడ్డి యూనివర్సిటీలో మోటివిటీ ల్యాబ్స్ కంపెనీతో కలిసి ఏర్పాటుచేసిన టెక్నో ఇన్నోవేషన్ సెంటర్‌తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెంటర్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతిని కాంక్షించి మోటివిటీ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి వర్సిటీ ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర విషయాలపై శిక్షణ ఇస్తారని, నేరుగా ఐటీ సంస్థలకు వెళ్లి సేవలు అందించేలా విద్యార్థులను మోటివిటీ ల్యాబ్స్ తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కంపెనీ ప్లేస్‌మెంట్స్ కూడా కల్పిస్తుందని వెల్లడించారు. ఇన్నోవేషన్ సెంటర్లో నేర్చుకొన్న పరిజ్ఞానంతో ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కల్పించి ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉపకారం వేతనం కూడా ఇస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టులను విద్యార్థులు ఇంటర్న్షిప్గానూ వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. మొదట 300 మంది విద్యార్థులతో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. మోటివిటీ ల్యాబ్స్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ మాట్లాడుతూ మల్లారెడ్డి వర్సిటీలో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని అన్నారు. వివిధ అంశాలపై శిక్షణనిస్తూ, ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వీఎస్కే రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి మహేందర్‌రెడ్డి, అధ్యక్షుడు భద్రారెడ్డి, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.