హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-2026 పరీక్షను బుధవారం నిర్వహించనున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,06,439 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 293 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, విద్యార్థులను గంట ముందుగా సెంటర్లలోకి అనుమతిస్తామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు.
