హయత్‌నగర్, మార్చి 13 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ తిరుమల్ రావు, సీపీ చౌహన్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి, హయత్‌నగర్ మండల తహసీల్దార్ సంధ్యారాణి, ఏసీపీ పురుషోత్తం రెడ్డి, డీసీ సాయి శ్రీతో కలిసి సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలీసులు ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సీపీ చౌహాన్
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సందర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోనే భద్రపరిచి కౌంటింగ్ ఇక్కడే చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీపీ డీఎస్ చౌహాన్ సరూర్‌నగర్ ఇండోర్స్టేడియంను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియం లోపల చేపట్టిన ఏర్పాట్లను ఉప కమిషనర్లు సురేందర్‌రెడ్డి, హరి కృష్ణయ్య, మారుతీ దివాకర్, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ అశోక్‌రెడ్డిలు సీపీ చౌహాన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో 83.54 శాతం పోలింగ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,536 మంది ఓటర్లకు గాను 5460 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 2905 మంది, పురుషులు 2555 మంది ఉన్నారు. 83.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పరిశీలించారు.