అచ్చంపేట రూరల్ : ఉద్యోగుల పదవి విరమణ మరుపురాని ఘట్టమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ (MLA Cikkudu Vamsi Krishna) అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకత్వం చేసే గురువులని ప్రశంసించారు. అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో కెమిస్ట్రీ లెక్చరర్ రామకృష్ణ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రామకృష్ణ కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదని, ఆయన తరతరాలకు ఆదర్శప్రాయులైన మార్గదర్శకుడని కొనియాడారు. తన మూడున్నర దశాబ్దాల బోధనా ప్రస్థానంలో కేవలం పాఠ్యపుస్తకాలను మాత్రమే కాకుండా జీవిత పాఠాలను కూడా విద్యార్థులకు నేర్పిన ఆదర్శ ఉపాధ్యాయుడని అన్నారు. వారి బోధనల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకొని, సమాజానికి విలువైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.