TCS Jobs : ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక సంస్థలు వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అయితే, టీసీఎస్ మాత్రం ఉద్యోగుల్ని నియమించుకునే పనిలో ఉంది. ఐటీ సేవలు అందిస్తున్న ఇండియన్ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ 25,000 మంది ఫ్రెషర్స్‌కు అవకాశం కల్పించనుంది.
సంస్థ సీఈవో, ఎండీ కే క్రితివాసన్ దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. డిమాండ్‌కు అనుగుణంగా కాలేజ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఒకపక్క ఐటీ కంపెనీలకు అవరోధాలు ఎదురవుతున్నా గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మాత్రం 44,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. దేశంలో గత ఏడాది అత్యధిక నియామకాలు చేపట్టిన ప్రైవేటు కంపెనీగా కూడా నిలిచింది. కొత్తగా ఎంపికైన ఫ్రెషర్లు పూర్తిస్థాయిలో ఉద్యోగంలో చేరేందుకు తొమ్మిది నెలలు పడుతుంది. 9 నెలల శిక్షణ అనంతరం ఉద్యోగులకు ప్రాజెక్టులు అప్పగిస్తారు. ఇదే సమయంలో 12,000 మందిని తొలగించింది. అయితే, ఉద్యోగుల్ని తొలగించేందుకు ఏఐ కారణం కాదని సీఈవో కే క్రితివాసన్ చెప్పారు. కంపెనీలో బాగా పనిచేసినంత కాలం తొలగింపు ఉండదని ఆయన అన్నారు.
సీనియర్ లెవల్ ఉద్యోగుల్ని ఎక్కువగా తొలగించినట్లు చెప్పారు. మరోవైపు టీసీఎస్‌లో ఉద్యోగులకు భారీ స్తాయిలో వేతనాలు పెరగబోతున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీసీఎస్‌కు 40 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల నాసిక్ టీసీఎస్‌లో మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి అంశాలతో ఈ సంస్థ వార్తల్లో నిలుస్తోంది.