మిగిలిన రెండు ఫార్మాట్లతో పోలిస్తే నాలుగు గంటల్లో ముగిసిపోయే పొట్టి క్రికెట్లో ప్రధానంగా బ్యాటర్లదే ఆధిపత్యం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ జరిగినా బ్యాటర్ల జోరు ముందు బౌలర్లకు పీడకలలు తప్పడం లేదు. ఒకప్పుడు పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థి ఎదుట 160, 180 లక్ష్యాన్ని నిర్దేశించి గెలుపు ఖాయం అనుకున్న జట్లు.. ఇప్పుడు 230, 250 కొట్టినా గెలుస్తామా? అన్న ఆందోళనలో ఉంటున్నాయి. ఈ సీజన్లో ‘300 స్కోరు సాధ్యమే!’ అన్న అంచనాలున్న నేపథ్యంలో అంత స్కోరు చేసినా గెలుస్తామన్న దీమా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లలో కనిపించడం లేదన్నది కాదనలేని వాస్తవం.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
IPL | సంప్రదాయక టెస్టు క్రికెట్‌తో పాటు ఆటగాళ్లను పరీక్షించే వన్డే ఫార్మాట్‌నూ తోసిరాజని గత కొన్నాళ్లుగా ఈ ఆటను ఏలుతున్న టీ20 క్రికెట్ అభిమానులను అలరిస్తుందనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ, దేశవాళీ స్టార్ల కలబోతలో బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఆటకు ఆట.. వినోదానికి వినోదం.. డబ్బుకు డబ్బు అన్న చందంగా 18 సీజన్లుగా విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ లీగ్‌లో ప్రధానంగా బ్యాటర్లదే ఆధిపత్యం. స్టార్క్, రబాడా, వుడ్, బౌల్ట్, షమీ, కమిన్స్, హేజిల్‌వుడ్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు సైతం గల్లీ స్థాయి బ్యాటర్ హిట్టింగ్ ముందు తలవంచక తప్పడంలేదు. పవర్ ప్లే నిబంధనలు, ఇంపాక్ట్ ప్లేయర్ వంటి రూల్స్‌కు తోడు పిచ్‌లు సైతం బౌలర్లకు పీడకలలను మిగుల్చుతున్నాయి. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుడిని నాలుగు గంటల పాటు ఎటూ కదలకుండా కూర్చోబెట్టడానికి గాను నిర్వాహకులు ఈ లీగ్‌లో పిచ్‌లను ‘బ్యాటర్ ఫ్రెండ్లీ’గా తీర్చిదిద్దుతుండటంతో తొలుత బ్యాటింగ్ చేసి 230కు పైగా స్కోర్లు చేసిన జట్లు కూడా గెలుపుపై దీమాగా ఉండలేకపోతున్నాయి. దీంతో బౌలర్లు వికెట్లు తీయడం దేవుడెరుగు! ఆర్చర్లాగా బాదుడు బాధితుడు కాకుంటే చాలన్న ఆందోళనలో గడపాల్సిన పరిస్థితి!
గత సీజన్ నుంచి ఐపీఎల్‌ను సుమారు 13 నగరాలలో ఆడిస్తున్నారు. ఇందులో చెన్నై, లక్నో వంటి మూడు, నాలుగు స్టేడియాలలో మినహాయిస్తే అన్నీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లే. దీంతో ఐపీఎల్లో 200+ స్కోర్లు సాధించడం అనేది ఇప్పుడు సర్వ సాధారణం. గత సీజన్లో ఏకంగా 38 సార్లు 200+ స్కోర్లు నమోదుకాగా 11 సార్లు 240, అంతకంటే ఎక్కువ స్కోర్లు రికార్డయ్యాయి. అయితే భారీ స్కోర్లు సాధిస్తున్నా మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు గెలుపు మీద నమ్మకం ఉండటం లేదు. నిరుటి సీజన్లో కోల్‌కతా, పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ (43వది)లో.. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 261/6 స్కోరు చేసింది. కానీ పంజాబ్ 18.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని దంచేసింది. ఆ మరుసటి రోజే ఢిల్లీ, ముంబై మ్యాచ్ (44వ)లో క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 257/4 చేస్తే ముంబై (247/9) దాదాపు గెలిచినంత పనిచేసింది. ఈడెన్ గార్డెన్స్‌లోనే కోల్‌కతా (31వ మ్యాచ్) నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఆఖరి బంతికి ఛేదించింది. 2024లోనే అత్యధిక పరుగులు నమోదైన హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ (30వది)లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టోర్నీలోనే అత్యధిక స్కోరు (287) నమోదుచేసింది. ఛేదనలో బెంగళూరు (262/7) కూడా బాదడంతో ఆఖరి ఓవర్ దాకా రైజర్స్‌కు గెలుపుపై ఆశలే లేవు.
వారం రోజుల క్రితమే అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ 18వ సీజన్ అయితే ఆరంభం నుంచే భారీ స్కోర్లకు వేదికవుతున్నది. రెండో మ్యాచ్‌లో హైదరాబాద్.. 286 పరుగులు చేసినా రాజస్థాన్ (242) విజయానికి దగ్గరగా వచ్చింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల ఛేదనను ఢిల్లీ 3 బంతులుండగానే బాదేసింది. పంజాబ్, గుజరాత్ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లే నమోదయ్యాయి. లక్నోతో మ్యాచ్‌లో హైదరాబాద్ చేసిన స్కోరు తక్కువేమీ (190) కాకపోయినా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఛేదనను లక్నో 16.1 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఇక 160, 170 వంటి లక్ష్యాలనైతే జట్లు 16, 17 ఓవర్లలోపే ముగిస్తున్నాయి. ఆరంభంలో వికెట్లు పడ్డా లోయరార్డర్ బ్యాటర్ల సాయంతోనూ ఫినిషర్లు మ్యాచ్‌ను ముగిస్తున్నారు.