దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికగా పేరు తెచ్చుకుంది తాప్సీ. గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో తన పంథా మార్చుకున్న ఈ పంజాబీ సొగసరి కథాబలమున్న చిత్రాలకే పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నది. అయితే ఇటీవలకాలంలో అగ్రహీరోలు నటించే కమర్షియల్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై తాప్సీ స్పందించింది. విజయానికి తన నిర్వచనం వేరని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా ఓ పరుగుపందెం లాంటిది. ఒంటరిగానే రేసులో దూసుకుపోవాలి. మన లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన ఉంటే గమ్యం చేరడం కష్టమేమీ కాదు. సినిమాల ఎంపిక విషయంలో నా లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. సక్సెస్ రావాలంటే హీరోలతో కలిసి నటించాలన్న నియమమేమీ లేదు. నా అభినయం ప్రేక్షకుల్ని మెప్పిస్తే అంతకుమించిన ఆనందం లేదు’అని చెప్పుకొచ్చింది.