తంగేడు.. తెలంగాణ ఒడిలో మొలిచే మొక్క, బతుకమ్మలో మెరిసే పువ్వు. తెలంగాణ సంస్కృతితో పెనవేసుకున్న తంగేడు మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుంది. దీని శాస్త్రీయ నామం సెన్నా ఆరిక్యులేటా. ఆయుర్వేదంలో దీనిని ఆవార్తకి అని పిలుస్తారు. ఈ మొకలోని ఆకులు, బెరడు, వేర్లు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పూలలో ఉండే ప్రత్యేక రసాయనాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. దీనిని కణాలకు చేరవేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి అయినా శరీరం సరిగ్గా వాడుకోలేకపోతుంది. ఆ సమయంలో తంగేడు పూలలోని యాంటి ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను రక్షిస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమై గ్లూకోజ్‌గా మారితే రక్తంలో చకెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. అదే, తంగేడు పూల కషాయం తాగడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే వేగాన్ని అదుపు చేయడంలో తంగేడు సహకరిస్తుంది.
ఈ పూలను ఎండబెట్టి పొడిగా చేసుకుని వాడుకోవచ్చు. లేదా తాజా పూలతో కషాయం తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో కొన్ని తంగేడు పూలు వేసి బాగా మరిగించాలి. ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించి, వడకట్టి పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. మారెట్లో తంగేడు పూల పొడి కూడా లభిస్తుంది. అయితే దీనిని వాడే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
వేడిని తగ్గిస్తుంది: తంగేడు పూలకు శరీరంలోని అధిక వేడిని తగ్గించే గుణం ఉంది. సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి మూత్ర విసర్జన సమస్యలు, మంట వంటివి ఎకువగా ఉంటాయి. తంగేడు పూల కషాయం తీసుకోవడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు తగ్గడంతో పాటు శరీరం చల్లబడి, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
కొలెస్ట్రాల్‌పై దాడి: మధుమేహంతో బాధపడేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎకువగా ఉంటుంది. తంగేడు పూలలో ఉండే సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సాయపడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపు కాస్తాయి.
మన రుగ్మతలను నయం చేసే ఎన్నో మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. తంగేడు కూడా అలాంటి ఒక సహజ సిద్ధమైన ఔషధమే. అయితే ఏదైనా అతిగా వాడితే ప్రమాదమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. షుగర్ నియంత్రణకు ఇది మంచి సహాయకారిగా పనిచేస్తుంది. అయితే, వైద్యుల సలహా లేకుండా సొంతంగా ప్రయోగాలు చేయకూడదనే విషయాన్ని విస్మరించకండి.