ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. చింతపండు. ఈ పుల్లటి పండు పడకుంటే.. మన వంట పూర్తికానట్లే! ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, ఆమ్ల లక్షణాలు గాఢంగా ఉండే చింతపండు.. మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా!
పాత్రలను తోమడానికి చింతపండును మించిన క్లీనింగ్ ఏజెంట్ లేదు. ఎలాంటి జిడ్డు మరకలనైనా.. ఇట్టే తొలగిస్తుంది. చింతపండుతో వంట పాత్రలను తోమడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి.
ఇంటిని ఎంత శుభ్రం చేసినా బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు రావడం సహజం. వీటిని తరిమేందుకు చింతపండు చక్కగా సహాయ పడుతుంది. కీటకాలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో చింతపండు పేస్టును ఉంచండి. చింతపండు వాసనకు కీటకాలన్నీ పారిపోతాయి.
కొందరు ఇంట్లోనే సబ్బులు, లిక్విడ్లు తయారు చేసుకుంటారు. అలాంటప్పుడు చింతపండు రసాన్ని కూడా వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చింతపండు రసం.. చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. దీనిలో ఉండే ‘ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్’.. చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా తయారుచేస్తాయి. ఇందులోని ‘టానిన్స్’ అనే సమ్మేళనాలు.. వస్ర్తాలపై మరకలను తొలగిస్తాయి. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ చింతపండు ముందుంటుంది. స్నానం చేసేటప్పుడు చింతపండు రసంతో తలను కడుక్కుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.