హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తేతెలంగాణ) : ‘30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకొనేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చారు. ఇప్పటికే అనేక మంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. 22-ఏ వెనుక ఉన్న ప్రభుత్వ గద్దలెవరో తెలుసని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అక్రమ బాగోతాన్ని త్వరలోనే బట్టబయలు చేస్తానని వెల్లడించారు.
అసలు ఏ అధికారంతో ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు? ప్రజల భూమి ప్రజలకు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎవరు? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో సకల హంగులతో 69,000 డబుల్ బెడ్రూ మ్ ఇండ్లను నిర్మించి చరిత్ర సృష్టించామని వివరించారు. ఇటీవలే సీఎం శంకుస్థాపన చేసిన కొల్లూరులో ఎక్కడాలేని విధంగా 16 వేల ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.