Kiwi Fruit | మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల పండ్లల్లో కివి పండు కూడా ఒకటి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో విటమిన్ సితో పాటు విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కివి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కివి పండ్లను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నిద్రలేమిని తగ్గించడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. నిద్రించే ముందు కివి పండ్లను తీసుకోవడం వల్ల మనం త్వరగా నిద్రపోవడంతో పాటు ఎక్కువసేపు నాణ్యమైన నిద్రను కూడా సొంతం చేసుకోవచ్చు. అసలు నిద్రపోవడానికి కివి పండ్లను మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
కివి పండులో సహజంగానే సెరొటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించే ఒక రసాయనం. కివి పండును తీసుకోవడం వల్ల శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి ప్రోత్సహించబడుతుంది. దీంతో మనం గాఢమైన నిద్రను పొందగలుగుతాం. నిద్రించే ముందు కివిపండును తినడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. అలాగే నిద్రించే సమయం కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కివి పండ్లల్లో విటమిన్ సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మంట, వాపు వంటి వాటిని తగ్గిస్తాయి. దీంతో మనం ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. అదే విధంగా క్రమం తప్పకుండా కివి పండ్లను తీసుకోవడం వల్ల మెరుగైన నిద్ర సామర్థ్యాన్ని పొందగలుగుతాం. దీని వల్ల మనం ఎక్కువ సమయం నిద్రకు కేటాయించగలుగుతాం. శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. మెలటోనిన్ మన శరీరానికి ఇది నిద్రపోయే సమయం అని సూచించే ఒక హార్మోన్. కివి పండ్లను తీసుకోవడం వల్ల ఇవి మెలటోనిన్ సంశ్లేషణకు పరోక్షంగా మద్దతును ఇస్తాయి. దీంతో చీకటి కాగానే నిద్రించాలనే కోరిక కలుగుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడే వారిలో రాత్రి సమయంలో చక్కెర స్థాయిలు ఎక్కువవడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాంటి వారు నిద్రించే ముందు కివి పండ్లను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా రాత్రిపూట వచ్చే స్పైక్ లేదా క్రాష్ లు నివారించబడతాయి. నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది. కివి పండ్లల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను సడలించడానికి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కివి పండ్లను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. అలాగే రాత్రి పూట కివి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గి నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది. కివి పండ్లు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. నొప్పుల కారణంగా నిద్రలేమితో బాధపడే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా కివి పండ్లు మనం నిద్రించడానికి ఎంతగానో సహాయపడతాయని వీటిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.