T20 World Cup 2026 | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 7, శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ తొలి రోజే పలు ఆసక్తికర మ్యాచ్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంక వేదికగా జరగనుండగా, మరోవైపు భారతదేశంలో స్కాట్లాండ్ – వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. అదే రోజు టీమిండియా కూడా తన తొలి మ్యాచ్‌కు సిద్ధమై అమెరికా జట్టుతో బరిలోకి దిగుతోంది.
ఈ మ్యాచ్‌కు ముందు ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు సంగీతం, నృత్య ప్రదర్శనలు, ప్రత్యేక ఆకర్షణలతో అట్టహాసంగా సాగనున్నాయి. నియో-క్లాసికల్ సంగీత విద్వాంసుడు రిషబ్ శర్మ సితార్ స్వరాలతో కార్యక్రమాన్ని ఆరంభించగా, లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి తన తాళాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. అనంతరం ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి ఆవిష్కరించనున్నారు.ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిలవనున్నారు.
ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి రోహిత్ శర్మ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకురానున్నారు. 2024 ఎడిషన్‌లో టీమిండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా రోహిత్‌కు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈసారి ఆ టైటిల్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భుజాలపై ఉంది. రోహిత్ శర్మతో పాటు వివిధ దేశాలను ప్రాతినిధ్యం వహిస్తున్న 20 మంది చిన్నారులతో కలిసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ అనంతరం ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు ఐసీసీ, బీసీసీఐ భారీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేశాయి. ప్రముఖ రాపర్ బాద్షా తన హిట్ సాంగ్స్‌తో స్టేజ్‌ను కదిలించగా, బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనేక మంది డ్యాన్సర్లు, లైవ్ మ్యూజిక్ షోలతో స్టేడియం సందడిగా మారనుంది. వేడుకల చివర్లో బాణసంచా ప్రదర్శనతో ఆకాశం రంగులమయం కానుంది.
ఈ గ్రాండ్ ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం 7 గంటలకు టీమిండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు టైటిల్ వేటను ఘనంగా ఆరంభించేందుకు సిద్ధమవుతుండగా, అభిమానులు భారీ అంచనాలతో ఈ టోర్నీని స్వాగతిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లో మరో సంబరానికి నేడు నాంది పలకనుంది.