హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీహబ్‌లో మంగళవారం నుంచి ‘ల్యాబ్-32’ ఏడో విడత కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే ఈ కార్యక్రమానికి 23 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్టు టీహబ్ సీఈవో ఎమ్మెస్ రావు వెల్లడించారు. 2018లో ప్రారంభమైన సీడ్ యాక్సిలరేటర్ ల్యాబ్-32లో ఇప్పటివరకు 6 విడతల్లో 225 స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణలో అన్ని విధాలుగా చేయూతనిచ్చి ఆర్థిక తోడ్పాటునందించినట్టు తెలిపారు. ఏడో విడతలో సుస్థిరత, ఎడ్టెక్, డైరెక్ట్ టు కన్జ్యూమర్, మీడియా, ఫిన్‌టెక్, అగ్రిటెక్, సైప్లెచైన్ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించే స్టార్టప్‌లు ఉంటాయని వివరించారు. బ్లాక్‌చైన్, బిగ్‌డేటా, సైబర్ సెక్యూరిటీ తదితర టెక్నాలజీల స్టార్టప్‌లకు ల్యాబ్-32 ద్వారా తోడ్పాటునందిస్తామన్నారు.