నాన్న పొగబారిన శ్వాస, నాన్న పొలమారిన జ్ఞాపకం, నాన్న బాధ్యతలను నెత్తినెత్తుకున్న బోనం. నాన్న మసిబారే కళ్ళల్లో తడారని బంధం. నాన్న ఒక ప్రేమ. నాన్న ఒక భయం. అంతిమంగా నాన్న జీవితం కరిగిపోయే కొవ్వొత్తి. తాను కష్టపడుతూ పిల్లల కళ్ళల్లో వెలుగులు నింపుతాడు.
ఊరు, అమ్మ, నాన్న, కులవృత్తి… ఇవన్నీ ఒక ఎమోషనల్. ఒక ఎటాచ్మెంట్. ఒక బాధ్యత. ఒక బంధం. గుండె మౌనంగా దేని కోసమో వెతుకుతుం ది. తిరిగిరాని బాల్యంలోనికి కలియ తిరుగుతుంది. జ్ఞాపకాల చెక్కిలి మీద ఒక కన్నీ టి చుక్క ఘనీభవిస్తుంది. బాణాల శ్రీనివాసరావు తన ‘కుంపటి’ దీర్ఘ కవిత ద్వారా ఊరు, నాన్న, కులవృత్తి, తన బాల్యాన్నంతటిని అద్భుతంగా ఆవిష్కరించారు. పదహారణాల తెలంగాణ పల్లెను తన అక్షరాల్లో, తన కవితలో తన బాల్యాన్ని మనకు పరిచయం చేస్తాడు బాణాల. సాతానోళ్ల బాయి పక్కన చింతల్లో చిటారుకొమ్మన దాగిన చింత చిగురును కోసి జేబు నింపుకొన్న సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏ బాదర బందీ లేని తన బాల్యాన్ని ఆకాశానికి హద్దుగా అక్షరీకరిస్తాడు. కవి అక్షరాలకు కళ్లుంటాయి. తన అక్షరాల్లో కన్నీళ్లుంటాయి. ఊర్లో కరువు వచ్చినప్పుడు నగలను చేసే నాన్న చేతులు నందికొండ కాలువ పనికిపోయి నాపరాళ్లెత్తినప్పుడు కలిగిన దుఃఖం కన్నీళ్లకే తెలుసు. మధ్యాహ్నం అమ్మ పెట్టిచ్చిన అన్నం డబ్బాను స్కూల్కు తెచ్చి నాన్న తినిపించిన యాదిని మర్చిపోలేని కవి శ్రీనివాసరావు కళ్లల్లో కురిసిన కన్నీటిని అక్షరం చేశాడు.
చిన్నప్పటి జ్ఞాపకాలను తెరలు తెరలుగా మబ్బు తొలిగిన సూర్యుడి వలె ఒక్కొక్కటీ కండ్లముందు ప్రవహింపజేస్తాడు. కుంపటి… అవుసలోల్ల (కంసాలోళ్ల) చుట్టూ నిరంతరం మండే అగ్నిగోళం, బ్రహ్మం గారి జాతరలో జనుల కష్టాలను తీర్చే అగ్నిగుండం, అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ, కులవృత్తికి చిత్రిక, ఒక గుండె ధైర్యం, ఒక జీవనవేదం, జీవనాధారం, బడుగువర్గాల పర్యాయపదం, చీకటి వెలుగుల నావకు దిక్సూచి, పలికించే తంత్రీనాదం, వెలుగునిచ్చే వెన్నెల దీపం, కళ్లల్లో మెరుపులు, నాన్న కళ్లల్లో మసి, మసకబారిన జీవనం, ఊపిరితిత్తుల్లో పొగ, కుంపటిపై మెరిసే బంగారం జీవితం దినదిన గండం. 3వ స్టాంజాలో…
‘సగం తెరిచిన కళ్ళతో దుకాణంలోకి చూస్తే యజ్ఞ గుండం ముందు ఋషిలా ఒక చేత్తో గొట్టాన్ని ఊదుతూ మరో చేత్తో నీరుకారును కుంపట్లో నాట్యం చేయిస్తూ రెండు చేతుల్ని… ఆడిస్తూ చెంపలకు రెండు బెలూన్లను తగిలించుకొని తీక్షణమైన చూపుల్తో ఊపిరితిత్తుల్లోని గాలినంతా ట్లోకి ఊదితే…’
దీనిలో నాన్న పడే కష్టం మనకు కనిపిస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆ కళకు రోజూ మెరుగులు దిద్దుతూ, ఓపిక, సహనానికి రోజూ ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొంటూ పని చేస్తేనే ఈ రోజుకు ఇంట్లో బియ్యం ఉడికేది. ఎలా చేస్తే నగ అందంగా ఉంటుందోనన్న ఆలోచన తప్ప పొగ గొట్టాన్ని ఊది ఊది ఊపిరి తిత్తుల్లోపొగ పేరుకుపోతుందన్న విషయం పట్టించుకోడు నాన్న. నాన్న కుటుంబం కోసం చేసే త్యాగాలు ఎన్ని చెప్పినా తక్కువే.
అహర్నిశలూ మన కోసం బతికిన నాన్నను ఎవరైనా మర్చిపోతారా? కవి బాణాల శ్రీనివాసరావు ఈ దీర్ఘకవితను ఒక కథలా కవిత్వీకరించారు. ఈ పుస్తకం చదువుతుంటే ప్రతిదీ ఏదో రూపంలో మనింట్లో మన కండ్లముందు జరిగినట్టు అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదువుతుంటే మన ఊరు జ్ఞాపకం వస్తుంది. మన బాల్యం కండ్లముందు కదలాడుతుంది. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన పాపానికి ఊరు బంధం తెగిపోయింది. ప్రాణం పోయాక ఆత్మ మాత్రం ఊరి చుట్టే తిరుగుతుంది.