హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 1: హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద స్విమ్మర్లు ఆందోళనకు దిగారు. స్విమ్మింగ్ పూల్ నెలసరి రుసుమును విపరీతంగా పెంచడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్విమ్మర్లు ప్లకార్డులతో గురువారం నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఇన్చార్జి డిఎస్ఓ కొత్త ప్రశాంత్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంపై మండిపడ్డారు. గతంలో స్విమ్మింగ్ పూల్ నిండుగా కలకలలాడుతూ ఎంతోమంది స్విమ్మింగ్ చేసేవారు. అయితే స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పేరుతో సంవత్సరనరపాటు నిలిపివేశారు.
మరమ్మతుల అనంతరం స్విమ్మింగ్ చేయడానికి చెల్లించాల్సిన రుసుమును విపరీతంగా పెంచడంతో చాలామంది తగ్గిపోయారు. ఇప్పటికైనా అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని రుసుమును తగ్గిస్తే బాగుంటుందని స్విమ్మర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎంతోమంది పోటీలకు వెళ్లి కూడా ఇక్కడి నుండి బహుమతులు గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు అది పేదవారికి అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.