Self Healing Roads | న్యూఢిల్లీ: రోడ్లపై గుంతలు వాహన చోదకులకు చికాకు కలిగిస్తుంటాయి. వాటిని పూడ్చేందుకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులను తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తిచేసేందుకు ఉపకరించే పదార్థాల తయారీపై బ్రిటన్ పరిశోధకులు దృష్టి సారించారు. ప్రత్యేకమైన ‘సెల్ఫ్-హీలింగ్’ తారును అభివృద్ధి చేశారు.
కృత్రిమ మేధస్సును ఉపయోగించి బయోమాస్ వ్యర్థాలు, మొక్కల నుంచి సంగ్రహించిన సూక్ష్మ బీజాలతో దీన్ని రూపొందించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలు, పగుళ్లను ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానే మరమ్మతు చేయడం ఈ తారు ప్రత్యేకత. స్వాన్సీ యూనివర్సిటీ, లండన్లోని కింగ్స్ కాలేజీ, చిలీ శాస్త్రవేత్తలు కలిసి ఈ తారును తయారు చేశారు.
బ్రిటన్లో రోడ్ల మరమ్మతుల కోసం ఏటా 143.5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.1,580 కోట్లు) ఖర్చు చేయాల్సి వస్తున్నదని, ఇప్పుడు తాము రూపొందించిన తారు మరింత మన్నికైన ‘నెట్-జీరో’ రోడ్ల అభివృద్ధికి దోహదం చేస్తుందని స్వాన్సీ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం తెలిపింది.