Suryapet |సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుల్లెట్ ట్రైన్ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు. సుమన్ షోటోకాన్ కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష దీక్షా శిబిరానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కరాటే మాస్టర్ జేవీ రమణ మాట్లాడుతూ.. సూర్యాపేటకు రైలు మార్గం ఎంతో అవసరమన్నారు. రైలు మార్గం వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తమ తరం గడిచిపోతున్నా.. భవిష్యత్ తరాలకైనా సూర్యాపేటకు రైలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.
మొదట ప్రతిపాదించిన విధంగానే శంషాబాద్-చెన్నై రైల్వే మార్గం అలైన్మెంట్ను మార్చాలని రమణ కోరారు. 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా సూర్యాపేట మీదుగా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కరాటే చిన్నారులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. సమితి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు సంతోష్, అక్షరతో పాటు పలువురు కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.