రామగిరి, నవంబర్ 7 : ఫౌరసరఫరాలశాఖ ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తున్నది. పాఠశాలల సీఆర్పీ ప్రతి నెలా చివరిలో గోదాముకు వెళ్లి వేలిముద్ర వేసి బియ్యం తీసుకుంటారు. అక్కడి నుంచి లారీల్లో పాఠశాలలకు పంపిణీ చేస్తారు. బహిరంగ మార్కెట్లోకి ఆ బస్తాలు వస్తే గుర్తించేలా ప్రత్కేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేయడం గమనార్హం. కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు, ఎంఈఓలు తనిఖీలు పర్యవేక్షించడంతో పాటు అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు భోజనం రుచి చూశాకే పిల్లలకు వడ్డించాల్సి ఉంటుంది.
పారదర్శకంగా మధ్యాహ్న భోజనం..
పాఠశాలలకు తరలించే బస్తాలను సులువుగా గుర్తించేలా 50కిలోల తెల్లని గోనె సంచులను వినియోగిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు, వంట ఏజెన్సీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ‘ప్రతి రోజూ ఎంత మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిన్నారు’అనే అంశాలను ఆన్లైన్లో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్పీలు విద్యాశాఖకు అందిస్తున్నారు. అంతేగాకుండా భోజన నాణ్యత పర్యవేక్షించేలా నిత్యం ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఏదో ఒక స్కూల్కు వెళ్లి పర్యవేక్షణ చేస్తూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు. విద్యార్థులకు పక్కా మెనూ ప్రకారం భోజనం అందుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతపై కమిటీల పర్యవేక్షణ
మధ్యాహ్న భోజనం మెనూ అమలు తీరును కమిటీలు పర్యవేక్షించనున్నాయి. ప్రతి వారం భోజనాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా గ్రామస్థాయిలో సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, విద్యావేత్తలతో కలిపి కమిటీలు ఏర్పాటు చేయాలి. తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓ త్రీమెన్ కమిటీలు మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ పరిశీలించాల్సి ఉంటుంది. వంట పూర్తయిన తర్వాత ముందుగా ప్రధానోపాధ్యాయులు భోజనాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. భోజనం బాగుందని వారికి అనిపిస్తేనే ఆపై పిల్లలకు వడ్డించాలి. ఆ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు సిద్ధం చేసింది.
ప్రధానోపాధ్యాయులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..
మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా హెచ్ఎంలు పర్యవేక్షించాలి.
భోజనం తయారీకి నాణ్యమైన బియ్యం, వంట సామగ్రిని వినియోగిస్తున్నారో లేదో పరిశీలించాలి.
కిచెన్, వడ్డించే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.విద్యార్థులంతా ఒకేసారికాకుండా విడుతల వారీగా భోజనాన్ని తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి.