కోదాడ/కట్టంగూర్(నకిరేకల్)/సూర్యాపేట టౌన్, డిసెంబర్ 3 : స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్, బీజేపీలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్ స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తే బీజేపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. శుక్రవారం భువనగిరి, ఆలేరు, నకిరేకల్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అందుకు కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే ప్రక్రియలో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెట్టాపట్టాలేసుకుని పనిచేస్తున్నాయని విమర్శించారు. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందని తెలిపారు. ఆ భయంతోనే రైతాంగంలో అలజడి సృష్టించే కుట్రలకు బీజేపీ తెర లేపిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తి లేదని ఒకవైపు కేంద్రం చెబుతుంటే బాధ్యతలేని ఇక్కడి నాయకత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం కుట్రలో భాగమేనని తెలిపారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ తనదైన చైతన్యాన్ని చాటుకుంటుందని, బాధ్యత లేని బండి సంజయ్‌లాంటి నేతలు కల్లాల వద్దకు వస్తుంటే ఇక్కడి సమాజం చైతన్యాన్ని చాటిందని మంత్రి అభినందించారు. శాసనమండలి ఎన్నికల్లోనూ అదే చైతన్యాన్ని చాటేందుకు ఓటర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజార్టీతో ‘నల్లగొండ ఎమ్మెల్సీ’ సరికొత్త రికార్డు లిఖిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణీ పుల్లారెడ్డి, రైతు బంధు సమితి నియోజకవర్గ అధ్యక్షుడు సుంకరి అజయ్ కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.