ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు తిరిగి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఎవరైనా మాస్క్ లేకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. సామాజిక బాధ్యతగా కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికార యంత్రాంగం కోరుతున్నది.
సూర్యాపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. కొవిడ్ నిబంధనలను మళ్లీ అమలులోకి తెస్తుంది. ఇప్పటి వరకు ఇంకెక్కడి వైరస్ అనుకున్న వారికి ఇదో హెచ్చరికగా మారుతుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 44 యాక్టివ్ కేసులు ఉండగా ఒక్కరూ మాత్రం సూర్యాపేట జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ చేయడం పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజల వద్దకే వెళ్లి చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగానే ప్రచారం జరుగుతున్నట్లుగా కొవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో ముంచుకొస్తున్నది. రెండేండ్లుగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికి పోయి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అలాంటి కొవిడ్ మూడో సారి ఒమిక్రాన్ రూపంలో పలు దేశాల్లో ప్రబలుతుండగా మన దేశంలో కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి.
దీంతో వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చే వారు ఎయిర్‌పోర్టుల్లోనే టెస్ట్‌లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను మళ్లీ కఠిన తరం చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
మాస్క్ నిబంధన అమలుల్లో ఉంది
కొవిడ్ నిబందనలు అమలులోనే ఉన్నాయి. ఇప్పటికే కొవిడ్ మహమ్మారి రెండు సార్లు భయకంపితుల్ని చేసినందున ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే కొత్తవైరస్ ఒమి క్రాన్ రూపంలో వస్తున్నట్లు తెలుస్తు న్నందున అది వ్యాపించకుండా విధిగా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రూ. వెయ్యి ఫైన్ విధిస్తాం.
-రాజేంద్రప్రసాద్ ,ఎస్పీ, సూర్యాపేట
జాగ్రత్త అవసరం
కొవిడ్-19 ఎన్ని మ్యుటేషన్లు చెందినా..ఎన్ని రకాల పేర్లతో వచ్చినా వ్యాక్సినే షన్, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడంతో పాటు భౌతిక పాటిస్తే కొవిడ్ కాదు ఎలాంటి వైరస్ కూడా ఏమీ చేయదు. ప్రధానంగా వ్యాక్సినేషన్ చాలా ప్రోటెక్షన్ ఇస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ ఎటాక్ అయినా వ్యాధి తీవ్రత తగ్గు తుంది . దవాఖానలో చేరకుండానే బయట పడొచ్చు. ఒకవేళ థర్డ్ వేవ్‌గా ప్రబలిన ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధ్దంగా ఉంది.
-ఇన్చార్జి డీఎంహెచ్ఓ, డాక్టర్ హర్షవర్ధన్ సూర్యాపేట