హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్‌క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండమ్‌ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. తద్వారా పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టుతోపాటు సీతమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లకు సైతం అనుమతులు పొందే మార్గం సుగమమైంది. వివరాలు.. పర్యావరణ అనుమతుల్లేకుండా సాగునీటి, తదితర ప్రాజెక్టుల ను చేపట్టడం, ఆ తరువాత ఉల్లంఘనల కేసు లు నమోదుకావడం, జరిమానాలు విధిస్తూ అ నుమతులను మంజూరు చేయడం పరిపాటిగా వస్తున్నది.
ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి (ఈసీ) పొందకుండానే ప్రారంభమైన ప్రాజెక్టులకు తదుపరి ఈసీ మంజూరు చేసేందుకు పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్, 2006 చట్టం కింద ఉల్లంఘన కేసులను గుర్తించి, పరిషరించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని నిర్దేశించేందుకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ 2021లో ఆఫీస్ మెమోరాండమ్ (ఓఎం)ను జారీచేసింది. అయితే, కేంద్రం జారీచేసిన ఓఎంను ‘వనశక్తి’తోపాటు పలు పర్యావరణ సంబంధిత ఎన్జీవోలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. అనుమతి లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులను క్రమబద్ధీకరించేందుకు పర్యావరణ (పరిరక్షణ) చట్టం-1986 వ్యతిరేకమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 ఉల్లంఘన కిందికే వస్తుందని వాదించాయి. ముందస్తు పర్యావరణ అనుమ తి పొందాలనే ఆవశ్యకతను నీరుగారుస్తుందని తెలిపాయి.
వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం పోస్ట్-ఫ్యాక్టో ఈసీల మంజూరును మే 2025లో నిషేధించింది. ఆ తరువాత ఆ తీర్పును పలువురు సు ప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ పిటిషన్లను 2025 నవంబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్‌చంద్రన్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధ ర్మాసనం సమీక్షించింది. వనశక్తి తీర్పు ప్రాథమికంగా పూర్వ తీర్పులకు విరుద్ధంగా ఉన్నదని వెల్లడించడంతోపాటు, తీర్పును ఉపసంహరించుకున్నది. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. తదుపరి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రిట్ పిటిషన్ల విచారణను గత ఏప్రిల్‌లోనే పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చే సింది. తాజాగా సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జ యమాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిల ధర్మాసనం అందుకు సంబంధించిన తీర్పును బుధవారం వెల్లడించింది. కేంద్రం 2021లో జారీచేసిన ఓఎంను రద్దు చేసింది. ఇప్పటికే మంజూరైన అనుమతులకు రక్షణ కల్పించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), సీతమ్మసాగర్ ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులకు మార్గం సుగమమైంది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను అనుమతులు లేకుండా చేపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన రైతులు గతంలో ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై బెంచ్ మొత్తం ప్రాజెక్టుల కాస్ట్లో 1.5% అంటే రూ.920 కోట్ల జరిమానా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా సీతమ్మసాగర్ ప్రాజెక్టుపై కూడా పిటిషన్లు దాఖలు కాగా, రూ.53 కోట్ల జరిమానా విధించారు. ఇక గౌరవెల్లి రిజర్వాయర్‌ను గతంలో 1.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, అటు తరువాత దానిని తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలకు పెంచింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రభావం పెరుగుతుందని పలువురు బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. అయితే, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఈసీలు మంజూరయ్యే క్రమంలో వనశక్తి తీర్పు అమల్లోకి వచ్చింది. దీంతో అప్రైజల్ కమిటీ ఆమోదం లభించినా కేంద్రం ఆయా ప్రాజెక్టులకు ఈసీని మంజూరు చేయలేదు. ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అనుమతుల మంజూరుకు మార్గం సుగమమైంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల సాధనకు మాజీ సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేశారు. పీఆర్ఎల్ఐఎస్కు పర్యావరణ అనుమతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో నిర్వహించిన పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్ర యత్నాలు చేసింది. కానీ, ఈఏసీ ఎప్పటికప్పు డు సందేహాలు లేవనెత్తుతూ, నివేదికలను కో రుతూ వాయిదా వేస్తూ వచ్చింది. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును తిరస్కరిస్తూ ప్రతిపాదనలను పక్కనపెట్టింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఈఏసీ కోరిన డాటాను సమర్పించింది. ఎట్టకేలకు 2023 జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టు ప్రతిపాదనలపై చర్చించింది. తుదకు 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కార్ తరఫున అప్పటి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి విజ్ఞప్తి చేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తంచేసిన ఈఏసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి 2023 సెప్టెంబర్‌లోనే సిఫార్సు చేసింది. అయితే, తదుపరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనుమతుల జారీ నాటి నుంచి పెండింగ్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుతం కోర్టు తీర్పుతో అనుమతుల మంజూరుకు మార్గం సుగమమైంది.