Meenakshi Natarajan | న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభకు పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ వేసిన పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీం కోర్టు ఆమె వాదనలు వినడానికి అంగీకరించింది. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్‌లు ప్రశాంత్ కుమార్ మిశ్రా, అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన పార్షియల్ వర్కింగ్ డే బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించకుండా అసంపూర్తి అఫిడవిట్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ఒక ప్రైవేట్ కేసని, పిటిషనర్‌కు కేవలం సమన్లు మాత్రమే అందాయని, అది రెండేండ్ల లోపు శిక్షపడే కేసుకు సంబంధించినవని ఆయన తెలిపారు. దీంతో కేసును శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.