Supreme Court : దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రోడ్డు ప్రమాదాల (Road accidents) నియంత్రణకు సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలు వెలువరించింది. రాజస్థాన్ (Rajasthan) లోని ఫలోడీ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదాలను సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ జరిపింది. రహదారులపై అక్రమ పార్కింగ్లు, బ్లాక్స్పాట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కును ఇచ్చిందని గుర్తుచేసింది. ఈ అధికరణంలోనే ప్రతి ప్రయాణికుడికి ప్రమాదరహితంగా వెళ్లే హక్కు అంతర్గతంగా ఉందని తెలిపింది. ప్రయాణికుల భద్రతను ప్రభుత్వ బాధ్యతగా చూడాలని తెలిపింది.
అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, రైట్ ఆఫ్ వే (రహదారి+మార్జిన్) లలో నూతన దాబా, హోటల్, వాణిజ్య నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సూచించింది. జాతీయ రహదారుల వెంబడి నిర్మించిన అక్రమ నిర్మాణాలను 60 రోజుల్లోగా తొలగించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. జాతీయ రహదారులు వెళ్తున్న జిల్లాల్లో.. 15 రోజుల్లోగా జిల్లా రహదారుల భద్రతా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో సూచించింది.
రాష్ట్ర పోలీసు, రవాణాశాఖకు చెందిన అధికారులు నిరంతరం రహదారులను పర్యవేక్షించాలని, వాహనాలకు ట్రాకింగ్ పరికరాలను అమర్చాలని సూచన చేసింది. ప్రతి 75 కిలోమీటర్లకు వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని, వీటిలో విశ్రాంతి గదులు, హోటల్స్, తదితర సౌకర్యాలను కల్పించాలని సూచించింది. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించాలని అక్కడ రక్షణ చర్యలు, హెచ్చరిక బోర్డులను ఉంచాలని పేర్కొన్నది. రెండు నెలల అనంతరం అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.