న్యూఢిల్లీ: నోయిడాలో ఉన్న 40 అంతస్తుల సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను మరో రెండు వారాల్లో కూల్చివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బహుళ అంతస్తుల బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు 72 గంటల్లో సంబంధిత అన్ని ఏజెన్సీలతో చర్చలు నిర్వహించి, నిర్ణీత సమయంలో కూల్చివేత ప్రారంభించాలని నోయిడా సీఈవోకు సుప్రీం తెలిపింది. ఎమరాల్డ్ కోర్ట్ బిల్డింగ్ అక్రమంగా నిర్మించినట్లు గతంలో సుప్రీం తేల్చిన విషయం తెలిసిందే. కూల్చివేత కోసం ఎడిఫైస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూపర్‌టెక్ నిర్మాణ సంస్థను సుప్రీం కోరింది. 40 అంతస్తుల టవర్స్‌లో ఇండ్లు కొన్నవారికి డబ్బును రిఫండ్ చేయాలని కూడా సూపర్‌టెక్ సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆ చెల్లింపులు జరగాలని పేర్కొన్నది. బాధితులు కోర్టుకు వచ్చేలా చేయవద్దు అని సుప్రీం తెలిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.