గంగాధర : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతోందని, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మేజర్ గ్రామపంచాయతీ అయిన చొప్పదండిని మున్సిపాలిటీ చేసినట్లు గుర్తుచేశారు. చొప్పదండి మున్సిపాలిటీకి నిర్వహించిన మొదటి ఎన్నికల్లో 90% సీట్లని సాధించామని పేర్కొన్నారు.
ఈసారి అదే ఉత్సాహంతో గెలుపు గుర్రాలను బరిలో దించామని, 100 శాతం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి జైత్రయాత్ర మొదలుపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చొప్పదండి మున్సిపాలిటీని 140 కోట్లతోని అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజల మధ్యలో ఎండగట్టాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ సమక్షంలో నిర్వహించనున్న సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నూతన సర్పంచ్లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను అభినందించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.