ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను ఎదుర్కొన్నది. సమాజం ఏమనుకున్నా.. తాను అనుకున్నది సాధించింది. ఐదేళ్ల క్రితం మిసెస్ ఇండియా కిరీటాన్నిగెలుపొంది చిన్ననాటి కలను సాకారం చేసుకుంది ఎం.ఎ.ఫర్హా. ఇటీవల కేంద్ర యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికైంది. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, యువత లక్ష్యాల కోసం పాటుపడుతున్న మిసెస్ ఇండియా ఫర్హా జిందగీతో పంచుకున్న విశేషాలు.. తన మాటల్లోనే..
మాది ఖమ్మం పట్టణం. ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ముగ్గురు చెల్లెళ్లు. నాన్న టైలరింగ్ చేస్తూనే మా అందరినీ చదివించారు. మహోన్నతమైన మన దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఏ రోజుకైనా ఇండియాను నా ఇంటిపేరుగా మార్చుకోవాలని బడికి వెళ్లే రోజుల నుంచే కలలు కనేదాన్ని. నా చిన్నతనంలో సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆమెలా అందాల కిరీటం దక్కించుకోవాలని కోరుకునేదాన్ని. ముస్లిం కుటుంబంలో పుట్టిపెరగడం వల్ల ఇవన్నీ సాధ్యం అవుతాయా? అనిపించేది. ఇంటర్ పూర్తికాగానే, ఇంట్లోవాళ్లు ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు. బాబు పుట్టిన తరువాత నాన్న ప్రోత్సాహంతో డిగ్రీలో చేరాను. ఏదైనా బిజినెస్‌లో రాణించాలని ఎంబీఏ చదివాను. నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్న సమయంలోనే మిమెస్ ఇండియా నోటిఫికేషన్ వెలువడింది. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. బుర్కా తీయడం మన సంస్కృతి కాదంటూ చాలామంది వ్యతిరేకించారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా 2021లో మిసెస్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నా.
నా ఇద్దరు పిల్లలు అప్పటికి చిన్నవాళ్లే కావడంతో వారిని తీసుకొని అహ్మదాబాద్‌కు ఒక్కదాన్నే వెళ్లాను. ఆ పోటీలు ఐదురోజుల పాటు సాగాయి. ఓవైపు పిల్లలను చూసుకుంటూనే.. పోటీల్లో పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా 900 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో 40 మందిని ఎంపిక చేశారు. ఆ తరువాత ఫైనల్ రౌండ్‌కు ముగ్గురిని పంపారు. ఆ ముగ్గురిలో నేను టాప్‌లో నిలిచి (ఫస్ట్ రన్నరప్) మిసెస్ ఇండియా కిరీటాన్నీ కైవసం చేసుకున్నాను. దానితో పాటు మిసెస్ ఇండియా ఫొటోజెనిక్ సబ్ టైటిల్ కూడా దక్కించుకున్నాను. పుట్టి పెరిగిన ఖమ్మం తప్పా బయటి ప్రపంచం తెలియని నేను.. మిసెస్ ఇండియా వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యాను. కచ్చితంగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో వెళ్లాను. చివరి రౌండ్ వరకు ఆత్మైస్థెర్యంతో నిలిచాను. ఎంతో బాధతో చిన్నపిల్లలను వెంటబెట్టుకొని వెళ్లిన నేను విజయంతో తిరిగొచ్చాను.
అప్పటివరకు సాధారణ గృహిణిలా కొనసాగిన నా జీవితం మిసెస్ ఇండియా కిరీటం దక్కిన తర్వాత పూర్తిగా మారిపోయింది. టైటిల్ గెలుచుకున్న తరువాత ఖమ్మం కార్పొరేషన్ నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఆ సమయంలో వనజీవి రామయ్యగారితో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సమాజానికి నావంతుగా ఏదైనా సేవ చేయాలని ‘ఫీడ్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. మహిళల విద్య, పర్యావరణం, యువత లక్ష్యాల వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. మన దేశంకోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నారులతో కలిసి 103 లేఖలు రాసి పంపించాను. మరోవైపు పలు సంస్థలకు చెందిన పలువురు తమ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యహరించమని కోరడానికి నన్ను సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాళ్లు నన్ను కలవకుండా చేయగలిగారు. ఓటమిపాలైతే నవ్వే సమాజం.. గెలిస్తే చూసి ఓర్వలేదన్నది అక్షర సత్యమనిపించింది.

Lawer
మిసెస్ ఇండియా సాధించినందుకు గాను 2021లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి అవార్డును ప్రదానం చేసింది. ఆ తరువాత నారీ రత్న అవార్డు, సూపర్ విమెన్, దుబాయ్‌లో లైఫ్‌ైస్టెల్ ఇన్ఫ్లూయెన్సర్ లాంటి అవార్డులను ప్రముఖ స్వచ్ఛంద సంస్థల చేతుల మీదుగా అందుకున్నాను. న్యూయర్క్‌కు చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నన్ను డాక్టరేట్‌తో గౌరవించింది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే నాకు ఫిట్నెస్, క్రీడలు అంటే కూడా ఇష్టమే. పలు క్రీడా పోటీలకు హాజరవుతుంటాను. ఎన్ని కష్టాలొచ్చినా అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు గాను, నేను నిర్వహిస్తున్న సేవలను గుర్తించి ఫిట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
ఇదే నా లక్ష్యం ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి ఈ దేశానికి నా సేవలను అందిస్తున్నానంటే అందుకు ఏకైక కారణం నా ఆత్మవిశ్వాసం. నా కలను నిజం చేసుకునేందుకు చాలా కష్టపడ్డాను. దానికి దక్కిన ప్రతిఫలమే ఈ ఫిట్ ఇండియా అంబాసిడర్. నేను ఏ స్థాయిలో ఉన్నా మహిళా సాధికారత కోసం పాటుపడటమే లక్ష్యంగా పనిచేస్తాను.పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పెళ్లయిన మహిళల కష్టాలు తెలిశాయి. భర్త, అత్తమామల వేధింపులను భరించలేక దినదిన గండంగా బతుకుతున్నవారు ఎందరో. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కలేని నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వారికి అండగా
నిలవాలని ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశాను. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. బాధిత మహిళల గొంతు వినిపించడానికి నల్లకోటు ధరించాను.
– రాజు పిల్లనగోయిన