భోపాల్, నవంబర్ 30: ఒక పాఠశాల విద్యార్థి చేసిన చిన్న తప్పు పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు.. సదరు విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. 52 సార్లు సారీ అంటూ వేడుకున్నా వినకుండా, ‘నీ కెరీర్ ముగిసినట్టే’, ‘నీ మెడల్స్ వెనక్కి తీసుకుంటా’ అంటూ 8వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ బెదిరించటంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి స్కూల్ భవనం మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్లో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని వెంటనే దవాఖానకు తరలించగా, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ‘స్కేటింగ్ చాంపియన్’గా జిల్లా తరఫున జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించిన ఆ విద్యార్థి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకురావటంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. క్లాస్‌రూమ్‌కు మొబైల్ ఫోన్ తీసుకొచ్చినందుకు తనను క్షమించాలని ప్రిన్సిపాల్‌ను 52 సార్లు వేడుకోగా.. ఆయన వినకపోవటం వల్లే ఈ ఘటనకు దారితీసినట్టు తెలిసింది.