హైదరాబాద్ : తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Actor Mohan Babu) స్పందించారు. శనివారం ఆయన ఎక్స్ వేదిక గా స్పందించారు. ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల క్షేత్రంలో మహాపచారం జరిగిందని తెలిసి శ్రీవారి భక్తుడినైన తాను చింతించానని అన్నారు.
వేంకటేశ్వర స్వామికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే తల్లడిల్లిపోయానని అన్నారు. నిత్యం తమ మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల (Tirumala ) క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఆ స్వామి దగ్గర కల్తీ జరగడం పాపం, ఘోరాతి ఘోరమని వ్యాఖ్యనించారు.
ఈ వ్యవహారం నిజమైతే నేరస్థులను శిక్షించాలని మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) నాయుడును కోరుతున్నానని పేర్కొన్నారు. స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.