e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News అమ్మ వస్తున్నది

అమ్మ వస్తున్నది

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లోప్రచురణకు ఎంపికైన కథ.

- Advertisement -

“వాట్‌ దీప్తీ? ఎంతో మంది, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం, ఇప్పుడు నీకొచ్చింది. ఆ అదృష్టాన్ని చేతులారా పాడు చేసుకుంటావా?” నచ్చ చెబుతున్నట్లు అన్నది టీమ్‌ మేనేజర్‌ యామిని.. దీప్తితో!
“నిజమే యామిని, ఎవరికైనా అమెరికా ఛాన్స్‌ అంటే ఆనందమే! కానీ, నా పరిస్థితి మీకు తెలుసుగా. పాపకు ఇప్పుడు ఆరో నెలే. ఇంత చిన్న పాపను వదిలి నేను వెళ్లలేను” అన్నది దీప్తి.
“ఏం మాట్లాడుతున్నావు దీప్తీ! పాపకు నీ ఫీడింగ్‌ లేదు. ఇంట్లో మీ అత్తగారు, మామగారు ఉన్నారు. మీ హజ్బెండ్‌ ఎలానూ చూస్తారు. ఓన్లీ ఫర్‌ టూ మంత్స్‌. ఇప్పుడు రిజెక్ట్‌ చేస్తే.. మళ్లీ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందో! ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు..” అన్నది యామిని.

“యామినీ! ఏ త్యాగం చేయడానికైనా నేను వెనుకాడను. కానీ, నా కోసం నా బిడ్డ చేత తల్లి ప్రేమను త్యాగం చేయించడం నాకిష్టం లేదు. అయామ్‌ సారీ యామిని”.. అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది దీప్తి.
దీప్తి వెళ్లిన వైపే చూస్తూ ఆమె అన్న మాటను పునశ్చరణ చేసుకోసాగింది యామిని.
అసలు ఈ పిల్లను చూస్తుంటేనే ఎప్పుడూ తనలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. దీప్తి తన టీమ్‌లో చేరి రెండు సంవత్సరాలు అయ్యింది. మంచి టాలెంట్‌ ఉన్న అమ్మాయి. ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటుందో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటుంది. ఈ విషయం ఆమె మాటల్లో గ్రహించింది. ఒక్కోసారి ఆ పిల్ల మాట్లాడే మాటలు సూటిగా తనకే
తగులుతాయి. ఈ రోజూ అదే పరిస్థితి. తనను తానే ప్రశ్నించుకో సాగింది యామిని.

“కంగ్రాట్స్‌ యామినీ.. అమెరికాలో మన కంపెనీ తరఫున డెమో ఇవ్వడానికి నిన్ను సెలెక్ట్‌ చేశాం. స్లాట్‌ బుక్‌ చేస్తున్నాం. నెక్ట్స్‌ ఫ్రైడే వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలి”.. మేనేజర్‌ మాటలతో యామిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తన కల నెరవేరబోతున్నది. ‘అమెరికా వెళ్లాలి’ అనేది తన చిరకాల కోరిక.
ఈ శుభవార్తను వెంటనే భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. ఇంటికి వెళ్తూ స్వీట్‌ బాక్స్‌ తీసుకెళ్లింది. అత్తగారికి, మామగారికి కూడా ఈ వార్త చెప్పింది. అత్తగారు కంగ్రాట్స్‌ చెప్పారు కానీ, అన్నీ ప్రాక్టికల్‌గా ఆలోచించే మామగారు మాత్రం..
“మరి పిల్లను ఏం చేస్తావ్‌? చిన్నదానికి రాత్రి పూట ఇంకా నీ ఫీడింగే! నెల రోజులు మరి.. అది నిన్ను వదిలి ఉండగలదా?” అంటూ సందేహం వెలిబుచ్చారు.
అంతే, ఒక్కసారి తన ఆనందం అంతా ఆవిరైపోయింది. తనకు అసలు కూతురు అనన్య గురించి ఆలోచనే రాలేదు. ఎలా ఇప్పుడు? బెడ్‌ రూంలోకి వెళ్లి దిగులుగా కూర్చుంది. ఈలోగా భర్త వచ్చాడు. వాతావరణం గంభీరంగా ఉండటం చూసి తన దగ్గరికి వచ్చాడు. మామగారు అన్న మాటలు చెప్పింది.
“ఎంబీఏ చదివిన వాళ్లకు అబ్రాడ్‌ ఛాన్సెస్‌ తక్కువ ఉంటాయి. అదృష్టం కొద్దీ నాకు ఆ ఛాన్స్‌ వచ్చింది” అన్నది.
భార్గవ్‌ ఏమీ మాట్లాడలేదు.
ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో భార్గవ్‌ అన్నాడు..
“ఒక్క నెలే కదా నాన్నా.. నేను మేనేజ్‌ చేస్తాను. పగలంతా మీ దగ్గరే అలవాటు, ఎటొచ్చీ రాత్రిపూట కొంచెం ఇబ్బంది పడాలి అంతే! నేను చూసు
కుంటాలే!”.
వీసా స్టాంపింగ్‌ అయిపోయింది. అమెరికా వెళ్లే ముందు రోజు రాత్రి పాపను గుండెలకు హత్తుకొనే పడుకొన్నది.
ఆ మర్నాడు ఎయిర్‌
పోర్ట్‌లో మాత్రం తనకు ఏడుపు ఆగలేదు. అప్పటిదాకా ఉన్న బింకం సడలిపోయింది. ఆమెలోని మాతృహృదయం అప్పుడు బయటపడింది. భార్గవ్‌ ఓదార్చాడు.
అక్కడికి వెళ్లిన తరువాత ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తూనే ఉండేది. ఇప్పట్లోలాగా అప్పుడు స్మార్ట్‌ ఫోన్స్‌ ఇంకా రాలేదు.

నెల కాగానే తను అమెరికా నుంచి
వస్తున్నప్పుడు ఆ నెల తన సంపాదనలో సగం పాప డ్రెస్సులు, బొమ్మల కోసమే ఖర్చు పెట్టింది. వచ్చిన మర్నాడు అత్తగారు చెప్పారు. తను వెళ్లిన రెండు రోజులకే అనన్యకు జ్వరం వచ్చిందనీ, భార్గవ్‌ ఈ.ఎల్‌. పెట్టి, పదిహేను రోజులపాటు పాపను చూసుకున్నాడన్న విషయం.
అది విని తల్లడిల్లిపోయింది. ఇక ఇంకోసారి అనన్యను వదిలి వెళ్లకూడదని గట్టిగా నిశ్చయించుకుంది.
ఆరునెలల తర్వాత మళ్లీ అమెరికా అవకాశం వచ్చినా, తను రిజెక్ట్‌ చేసింది.
అనన్యకు మూడేళ్లు వచ్చాయి. యామినికి రెండోసారి బాబు పుట్టాడు. రెండుసార్లు ఆఫర్‌ వచ్చినా వదులుకుంది. బాబుకు ఏడాది వయసప్పుడు తనకు ప్రమోషన్‌ వచ్చింది. అయితే ఇప్పుడు తప్పనిసరిగా తను తన ప్రొడక్ట్‌ డెమో కోసం వివిధ దేశాలు వెళ్లాలి లేదా ప్రమోషన్‌ అయినా వదలుకోవాలి. మళ్లీ అదే పరిస్థితి. ‘కుటుంబమా లేక కెరీరా?’
విషయం భర్తకు చెప్పింది.
‘నిర్ణయం నీదే’ అన్నాడు భర్త. అత్తగారు, మామగారు ఉదాసీనంగా ఉండిపోయారు. తన సంఘర్షణ చూసి తన కొలీగ్‌ సలహా ఇచ్చింది..
“నీ అభివృద్ధి.. నీ పిల్లల అభివృద్ధికి దోహదపడుతుంది. తాత్కాలికంగా బాధ అనిపించినా భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. భార్గవ్‌కు ట్రాన్స్‌ఫర్స్‌ ఉండవు కాబట్టి, నువ్వు లేనప్పుడు పిల్లల బాధ్యత తను చూసుకుంటాడు” అని.
‘నిజమే.. ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు’ అని మనసుకు సర్ది చెప్పు
కొన్నది.
గతాన్ని ఆలోచిస్తూ టైమ్‌ చూసుకోలేదు. గడియారం చూస్తే.. ఆరు దాటింది. వెంటనే బయల్దేరి ఇంటికి వచ్చింది. అప్పటికే భార్గవ్‌ వచ్చి చపాతీ పిండి కలిపి, కూర వండుతున్నాడు. తను ఎన్నోసార్లు అన్నది.. ఒక వంట మనిషిని పెట్టుకుందామని. కానీ వినడు.
‘ఇద్దరు మనుషుల కోసం పనిమనిషి అవసరమా! నీకు ఓపిక లేకపోతే నేను చేస్తాగా’ అంటాడు.
ఇద్దరి మధ్య ఏ మాటలూ ఉండవు. అలాగని అతని ప్రేమలో ఏ లోపమూ ఉండదు.

గాఢనిద్రలో ఉన్న యామినికి, ఫోన్‌ రింగవడంతో మెలకువ వచ్చింది. విసుగ్గా పక్కనే ఉన్న ఫోన్‌ తీసుకొని చూసింది. అది కస్టమర్‌ కాల్‌. కట్‌ చేసి టైమ్‌ చూసింది. సాయంత్రం ఐదు.
లేచి ఏసీ ఆఫ్‌ చేసింది. విండో కర్టెన్‌ తొలగించి బయటికి చూసింది. ఎండాకాలం కావడంతో సాయంత్రమైనా ఎండవేడిమి తగ్గలేదు.
అంత ఎండలోనూ భర్త భార్గవ్‌ దీక్షగా తన పని చేసుకుపోతున్నాడు. కాంపౌండ్‌ వాల్‌ గేటు నుంచి ఇంటి గుమ్మం వరకూ వేసిన రాళ్ల మధ్యలో అక్కడక్కడా పోయిన సిమెంటును మళ్లీ వేస్తున్నాడు. మేస్త్రీని పిలవొచ్చుగా అంటే..
‘ఇంత చిన్న పనికి వాళ్లను పిలవడం అవసరమా.. నే చేస్తాలే!’ అంటాడు.
గది తలుపు తీసుకొని కింద హాల్‌లోకి వచ్చి, సోఫాలో కూర్చుంది. హాల్‌లో షోకేస్‌లో.. ఒక మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉత్తమ ఉద్యోగినిగా తను అందుకొన్న అవార్డులు.. తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది.
ఏం సాధించింది తను? నెల క్రితం దీప్తి అన్న మాటలకు తనలో రేగిన అశాంతి, నిన్న కూతురు అడిగిన ప్రశ్నతో తుఫానుగా మారి మనసును అల్లకల్లోలం చేస్తున్నది. తల్లిగా తను ఓడిపోయిందా?
మళ్లీ గతాన్ని నెమరు వేసుకోసాగింది.

పాపను బడిలో చేర్పించారు. అప్పటికే అత్తగారు, మామగారు పెద్దవాళ్లు అయిపోయారు. వాళ్లకు భారం కాకూడదని బాబును చూసుకోవడానికి ఒక పనమ్మాయిని ఇంట్లోనే ఉండేలా ఏర్పాటుచేసింది. నెలకు ఒకసారి తను బయటికి వెళ్లాల్సి వచ్చేది. వారం రోజులు, రెండు వారాలు, ఒక్కోసారి నెల టూర్‌ ఉండేది.
యామిని టూర్‌ వెళ్లేప్పుడు మొదట్లో ఏడ్చినా, తర్వాత్తర్వాత పిల్లలకూ అలవాటైంది. పిల్లల మీద తన ప్రేమను.. వాళ్ల కోసం ఖరీదైన వస్తువులు, డ్రెస్సులు కొనడంలో చూపించేది యామిని.
చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. అత్తగారు, మామగారు చనిపోయారు. పిల్లలూ పెద్దవాళ్లు అయ్యారు. సహజంగానే పిల్లలిద్దరూ భార్గవ్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా కూతురు అనన్య.
అలాగని తనంటే ప్రేమ లేదని కాదు. తను టూర్‌ నుంచి రాగానే ఆ రోజు తనను ఒక్క పనీ చేయనీయదు.
“అమ్మా.. బాగా అలసిపోయి ఉంటావు రెస్ట్‌ తీసుకో!” అంటూ తనకు సేవలు చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట తనే వంట చేసి పెడుతుంది. తమ్ముడికైతే తల్లే అయ్యింది.
అసలు అనన్య పెద్దదయ్యాక తను నిశ్చింతగా ఉద్యోగం చేసుకోసాగింది. కానీ, ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా కావాలన్నా తండ్రిని అడిగినంత చనువుగా.. తనను అడగదు.
అనన్య బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌కి వచ్చినప్పుడు.. ‘ఎంఎస్‌ చేయడానికి కోచింగ్‌కు వెళ్లు’ అని యామిని చెప్పింది.
కానీ, ఎంఎస్‌ చేయడం తనకు ఇష్టం లేదనీ, అసలు తనకు జాబ్‌ చేయటం కూడా ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేసింది అనన్య. ఆ మాటలతో యామినికి పట్టరాని కోపం వచ్చింది.
‘నీ పెంపకంలో దాన్ని వంటింటి కుందేలులా చేశావ్‌’ అంటూ భార్గవ్‌ మీద అరిచింది.
దీంతో అనన్య బీటెక్‌ కాగానే, పట్టుదలతో సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు భార్గవ్‌. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే దూరపు బంధువుల్లో మంచి సంబంధం దొరికింది. అబ్బాయికి ఇంగ్లండ్‌లో ఉద్యోగం.
“నాన్నా.. నీకు ఇష్టమేనా? నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను..” సంబంధం గురించి చెప్పగానే అనన్య అన్న మాట ఇది. దీంతో మొదటిసారి యామినిలో అంతర్మథనం మొదలైంది. భర్త, పిల్లలు తనను పరాయిదానిలా చూస్తున్నారనే భావన కలిగింది.

పెళ్లి కాగానే భర్తతో కలిసి ఇంగ్లండ్‌ వెళ్తున్నప్పుడు తండ్రిని పట్టుకొని అనన్య ఏడుస్తుంటే.. ఎప్పుడూ స్థితప్రజ్ఞుడిలా ఉండే భార్గవ్‌ కళ్లలో నీరు తిరగటం చూసిన అందరి మనసులూ భారమయ్యాయి.
తనతో మాత్రం.. “అమ్మా.. నాన్న జాగ్రత్త” అన్నప్పుడు, మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు అనన్యను భార్గవ్‌ చేతిలో పెడుతూ తను అన్న ఇదే మాట గుర్తొచ్చి, కూతురిలో తల్లి హృదయాన్ని చూసింది.
అనన్య పెళ్లి అయిన ఏడాదికి బాబు ఎమ్మెస్‌ చేయటానికి అమెరికా వెళ్లాడు. తను ఇక ఇండియాకే పరిమితమైంది. అనన్య నెల తప్పిందన్న మాట విని భార్గవ్‌ చంటి పిల్లాడిలా గంతులేశాడు. తనకు కూడా.. కూతురు తల్లి కాబోతోంది అంటే అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తను ఇక లీవ్‌ ప్లాన్‌ చేసుకోవాలి.
అప్పటికప్పుడు సెలవులు అంటే కష్టం.
నిన్న వీడియో కాల్‌లో మాట్లాడుతూ..
“నాన్నా.. నాకు ఏడో నెల రాగానే మీకు, అమ్మకు టికెట్స్‌ బుక్‌ చేస్తాను. అమ్మా.. నీకు వీలైతే నాన్నతో రా. లేదంటే కనీసం డెలివరీ టైంకి వచ్చేట్టుగా ప్లాన్‌ చేసుకోగలుగుతావా?” అని అడిగింది.
చాచి మొహం మీద కొట్టినట్లు అయింది. అక్కడినుంచి మౌనంగా లేచి వచ్చింది. కూతురు ఇంకా ఏదో మాట్లాడుతున్నది. తనను, తమ్ముడిని ఎలా ఆడించాడో.. అలాగే తన పిల్లలను కూడా ఆడించాలని అనన్య అంటుంటే.. భార్గవ్‌ పరవశంతో వింటున్నాడు.

భార్గవ్‌ లోపలికి వచ్చాడు. నిన్న వీడియో కాల్‌లో అనన్య అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకొంటూ.. పరధ్యానంగా ఉన్న యామినిని చూసి, తనే వెళ్లి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చాడు. చేతలే తప్ప అతను ఎక్కువగా మాట్లాడడు. ఆమెకు మనసు బాగా లేనప్పుడు వెంటనే గుర్తొచ్చే స్నేహితురాలు ప్రసన్నకు ఫోన్‌ చేసింది.
“ఫ్రీగా ఉన్నావా.. వద్దామనుకుంటున్నా” అని అడిగింది.
ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. మనసు బాగా లేనప్పుడో, ఏదైనా సలహా కోసమో ఫోన్‌ చేస్తే అడిగే ప్రశ్న అది.
“ఖాళీగానే ఉన్నా.. రా!” అనగానే భర్తకు చెప్పి వెళ్లింది.
యామిని వచ్చి కూర్చోగానే..
“ఏమిటి విషయం?” ఆమె కూడా ఏ
అనవసర ప్రశ్నలూ వేయకుండా అడిగింది.
“జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఎన్నో అనుభూతులు పోగొట్టుకున్నాను అనిపిస్తోంది”.. అంటూ దీప్తి, తన కూతురు ఇద్దరూ అన్న మాటలు, ఈ మధ్య తనలో రేగుతున్న ఘర్షణ గురించి చెప్పింది.
“నేను పిల్లలు ఏదడిగితే అదిచ్చాను. కానీ, వాళ్లు ఎందుకో నాకు దగ్గర కాలేదు. నా ఉద్యోగ ధర్మంగా నేను వాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభ అనుభవించానో అర్థం చేసుకోవడం లేదు.
నా కుటుంబాన్ని, నా సరదాలు అన్నీ త్యాగం చేశాను. అసలు నేను ఆ రోజు భార్గవ్‌ను సలహా అడిగాను. ‘నీదే నిర్ణయం’ అన్నాడు. తను ‘వద్దు’ అని ఉంటే బాగుండేది. తను అలా అనలేదు. చివరికి ఒంటరిదాన్ని అయ్యాను..” మొదటిసారి యామిని కంటనీరు పెట్టడం చూసింది ప్రసన్న.

అనునయంగా స్నేహితురాలి భుజం మీద చెయ్యి వేసి..
“ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించడం గతజల సేతు బంధనంలా ఉంది. నీ మనసుకు తెలుసు.. నువ్వు ఇప్పుడన్న మాటలు, ఆరోపణలు ఎంత అర్థం లేనివో. నీ నిర్ణయం నువ్వే తీసుకొనే స్వేచ్ఛ భార్గవ్‌ నీకిచ్చాడు. భర్తగా నీ అభిప్రాయాలను గౌరవించాడు.
నువ్వు ఆ రోజు తల్లిగా కంటే బాధ్యత గల ఉద్యోగిగా ఆలోచించావు.
నిజానికి అన్ని విషయాలనూ నాతో పంచుకొనే నువ్వు.. అప్పుడు నన్ను సలహా అడగలేదు. ఎందుకంటే నీ నిర్ణయాన్ని కాదంటానేమో.. అని. ఇక, నువ్వన్న ఇంకోమాట.. ‘త్యాగం’ అని. నీకు కోపం వచ్చినా, ఆనందం వచ్చినా నీ కెరీర్‌లోనే వెతుక్కోవాలి అనుకున్న నువ్వు.. ‘త్యాగం’ అనే మాటను వాడటంలో అర్థం లేదు. తప్పని పరిస్థితులలో, రెండో ఆప్షన్‌ లేనప్పుడు చేసే పని త్యాగం అవుతుంది.
నీకు ప్రమోషన్‌ తర్వాత వచ్చేదేమో! నువ్వు స్వచ్ఛందంగా ఎన్నుకున్న మార్గం అది.
ఇక మూడో విషయం.. తల్లి తోడు అవసరమైన సమయంలో, నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు. పిల్లలు వాళ్ల ఆనందాలు, బాధలు అన్నీ తల్లితో షేర్‌ చేసుకోవాలి అనుకుంటారు. నువ్వు మాత్రం.. నీకు వీలైనప్పుడు వీకెండ్స్‌ వాళ్లతో కలిసి షాపింగ్‌ అనీ, మూవీస్‌ అనీ వెళ్లేదానివి. అది వాళ్లు ఎంజాయ్‌ చేశారు. కానీ, మానసికంగా దగ్గర కాలేకపోయారు.
వాళ్లకు తల్లీ, తండ్రీ భార్గవే అయ్యాడు. వాళ్లకు స్నానం చేయించాడు. గోరుముద్దలు తినిపించాడు. కథలు చెపుతూ జోకొట్టి నిద్రబుచ్చాడు. వాళ్ల హోమ్‌ వర్క్‌ చేయిస్తూ ఉపాధ్యాయుడయ్యాడు. వాళ్లను ఆడించాడు.. లాలించాడు. పిల్లలకు సర్వం తానే అయ్యాడు. అంతేకాదు, పనమ్మాయి రాకపోతే గిన్నెలు కడిగేవాడు. ఇల్లు తుడుచుకొనేవాడు.
ఇన్ని చేస్తూ తన ఉద్యోగ బాధ్యతలూ నిర్వర్తించేవాడు. తన విధుల్లో ఏ చికాకులు వచ్చినా పిల్లలను మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.
కానీ, ఏనాడూ అతను వీటిని త్యాగం అనుకోలేదు. ‘నా బాధ్యత’ అని కూడా అనుకోలేదు. తన కుటుంబాన్ని ప్రేమించాడు అంతే! కాబట్టే పిల్లలు అతనికి దగ్గరయ్యారు.
యామినీ.. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనన్య నీకు మరో అవకాశం ఇచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని.. తల్లిగా తృప్తిని పొందు..” ప్రసన్న మాటలతో యామిని మనసు తేలికపడింది.
ఇంటికి వస్తూనే కూతురికి వీడియో కాల్‌ చేసి..
“అమ్మలూ.. నేనూ నాన్నతో పాటుగా వస్తాను”.
యామిని మాట పూర్తి కాకముందే..
“ఏవండీ.. అమ్మ కూడా వస్తున్నదండీ. మా అమ్మ వస్తుందట!” అంటూ గట్టిగా అరిచి భర్తకు చెప్పింది అనన్య.
కూతురు కళ్లలో కనిపించిన మెరుపు.. యామిని మనసులోని చీకట్లను తొలగించింది.

తల్లి తోడు అవసరమైన సమయంలో, నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు. పిల్లలు వాళ్ల ఆనందాలు, బాధలు అన్నీ తల్లితో షేర్‌ చేసుకోవాలి అనుకుంటారు. నువ్వు మాత్రం.. నీకు వీలైనప్పుడు వీకెండ్స్‌ వాళ్లతో కలిసి షాపింగ్‌ అనీ, మూవీస్‌ అనీ వెళ్లేదానివి. అది వాళ్లు ఎంజాయ్‌ చేశారు. కానీ, మానసికంగా దగ్గర కాలేక పోయారు. వాళ్లకు తల్లీ, తండ్రీ భార్గవే అయ్యాడు. వాళ్లకు స్నానం చేయించాడు. గోరుముద్దలు తినిపించాడు. కథలు చెపుతూ జోకొట్టి నిద్రబుచ్చాడు. వాళ్ల హోమ్‌ వర్క్‌ చేయిస్తూ ఉపాధ్యాయుడయ్యాడు. వాళ్లను ఆడించాడు.. లాలించాడు. పిల్లలకు సర్వం తానే అయ్యాడు.

పోతరాజు. వి.ఎస్‌.కృష్ణకుమారి
పోతరాజు.వి.ఎస్‌.కృష్ణకుమారి స్వస్థలం విజయవాడ. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రీవాణి హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ అండ్‌ కరస్పాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2015లో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. అనేక కథలు, కవితలు రాశారు. ఓ సీత కథ (నవ్య), అంతర్వాహిని, శివోహం (ఉషోదయ వెలుగు), ప్రేమంటే (పాలపిట్ట) కథలు విశేష గుర్తింపు పొందాయి. ఈమె రాసిన కథలు నవ్య, పాలపిట్ట, ఉషోదయ వెలుగు మ్యాగజైన్‌లలో ప్రచురితమయ్యాయి. ఫేస్‌ బుక్‌ వేదికగా యాభైకిపైగా కథలను పోస్ట్‌ చేశారు. స్వాతి మాసపత్రిక నిర్వహించిన ‘నవల పోటీ’లో ఈమె రాసిన ‘జీవన విపంచి’ నవల, సాధారణ ప్రచురణకు ఎంపికైంది. ‘హైదరాబాద్‌ పాత నగర కవులు’ వేదిక నుంచి ఉగాది పురస్కారం అందుకొన్నారు. పీవీ నరసింహారావు మీద రాసిన ‘నీవు ఎవరు’ కవితకు, ‘సుమనస వందితం’, ‘ఏ డైరీ ఆఫ్‌ మిసెస్‌ అరవింద’ కథలకు బహుమతులు దక్కించుకొన్నారు.

పోతరాజు.వి.ఎస్‌.కృష్ణకుమారి,
94945 10994

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement