మోర్తాడ్, డిసెంబర్ 11 : ఆ పాఠశాలలో నాలుగు సంవత్సరాల క్రితం ఏడు తరగతులకు కేవలం 56 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కానీ కరోనా పరిస్థితులను అధిగమించి ప్రభుత్వ బడులు తెరుచుకున్న తర్వాత ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 170కి చేరుకున్నది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల కృషికి నిదర్శనంగా నిలుస్తున్నది. 2018లో ఈ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా మార్చారు. దీంతోపాటు పాఠశాల ఉపాధ్యాయుల కృషి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది.
ప్రైవేటుకు దీటుగా బోధన
ఈ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా బోధన కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పాఠ్యపుస్తకాలతోపాటు ప్రైవేటు పుస్తకాలు తెప్పించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
2018లో 56 మందే ..
2018లో ఈ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చారు. అప్పుడు పాఠశాలలో ఏడు తరగతులకు 56 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 170కి చేరుకున్నది. కరోనా సమయంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ పలుమార్లు వెళ్లి డిజిటల్ పాఠాలు చూసేలా ప్రోత్సహించడంతో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడి యం ప్రారంభించామని, పాఠశాలలో చదవడంతో కలిగే ప్ర యోజనాలను వివరించారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పక్కనే ఉన్న తొర్తి గ్రామం నుంచి ఈ పాఠశాలకు 20 మంది విద్యార్థులు వస్తున్నారంటే వారి కృషి ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.
హరితహారంలో భాగస్వామ్యం
ఏటా హరితహారం కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములవుతారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో ఏటా మొక్కలను నాటుతారు. బడి ఆవరణను ఆహ్లాదంగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు.
కంప్యూటర్‌పై అవగాహన
పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్‌పై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలకు ఐదు కంప్యూటర్లను దాతలు విరాళంగా ఇచ్చారు. ఇందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా మూడింటికి మరమ్మతులు చేయించాల్సి ఉంది. కంప్యూటర్ల మరమ్మతు విషయంలో గ్రామస్తులు సహకరిస్తే ఎక్కువ మంది విద్యార్థులకు కంప్యూటర్ తరగతులను నిర్వహించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అదనపు తరగతి గదులు అవసరం
పాఠశాలలో 1970లో నిర్మించిన తరగతి గదులు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గదిలో పెచ్చులూడి కిందపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు తరగతి గదులను నిర్మించాల్సిన అవసరం ఉంది.
గ్రామస్తులు ముందుకు రావాలి..
పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం గ్రామస్తులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులు సహకరిస్తే విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చు.