కరీంనగర్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడిని కాంగ్రెస్ పార్టీ స్వాగతించడమే కాదు, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది. సహచర ఎమ్మెల్యేపై దాడిని ఖండించాల్సిందిపోయి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన ప్రకటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆయన పేరుతో ఉన్న సోషల్ మీడియాలో మొదట ‘స్వాగతిస్తున్నాం @ కరీంనగర్’ అని పోస్టు పెట్టారు. అంటే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో బీజేపీ నేతలు చేసిన విధ్వంసాన్ని, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించడాన్ని స్వాగతిస్తున్నారా? అని నెటిజన్లు నిలదీశారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం ఒక ప్రకటన విడుదల చేశారు.
దానిలోనూ దాడి ఘటనను ఖండించకపోగా.. మరిన్ని భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఇక కరీంనగర్లో నీకు ఒక పునర్జన్మ అనుకో.. కనీసం కొట్టకుండా వదిలిపెట్టారు. ఇకనుంచి నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎక్కడ దొరికితే అక్కడ ప్రజలందరూ తిరుగబడి కొట్టాల్సి వస్తుంది.. తస్మాత్ జా గ్రత్త.. కౌశిక్రెడ్డీ’ అని ఆ ప్రకటనలో హెచ్చరించారు. తన పోస్టుపై వ్యతిరేకత రావడంతో సత్యం తన ఖాతా నుంచి డిలీట్ చేశారు.