పటాకులపై రాష్ర్టాల్లో ఆంక్షలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: వచ్చే నెల 4న దీపావళి. దివ్వెల పండుగకు మరో రెండు రోజులే ఉంది. పటాకుల నిషేధంపై తాము ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో అన్ని పటాకులను నిషేధించలేదని, ‘గ్రీన్ క్రాకర్స్’ విక్రయానికి అనుమతి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో ఈ దీపావళి ఎలా జరుగనున్నది? ఎక్కడ ఎలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయంటే…
ఢిల్లీ: దేశ రాజధానిలో పటాకుల అమ్మకం, కాల్చడంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ పూర్తి నిషేధం విధించింది. ఈ ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటాయి.
మహారాష్ట్ర: వాయు కాలుష్యం, కరోనా దృష్ట్యా ఈ దీపావళి నాడు పటాకులు కాల్చవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని సూచించింది.
పంజాబ్: దీపావళి, గురుపరబ్ (నవంబర్ 14)- ఈ రెండు రోజుల్లో రెండు గంటల చొప్పున (రాత్రి 8 నుంచి 10 వరకు) గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చుకోవడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల్లో ఈ అనుమతి రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) ఉంటుంది.
కోల్‌కతా: కాళీ పూజ, దీపావళి, ఈ ఏడాది ఇతర పండుగలను పురస్కరించుకొని పటాకుల అమ్మకం, కొనుగోలు, వినియోగాన్ని కోల్‌కతా హైకోర్టు నిషేధించింది. కరోనా దృష్ట్యా వాయు కాలుష్యం పెరుగకుండా ఓ ‘పిల్’పై ఈ ఆదేశాలు జారీ చేసింది. కాల్చినప్పుడు శబ్దం రానివి కూడా పటాకుల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్: జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)తో పాటు రాష్ట్రంలో గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని నగరాల్లో కూడా పటాకులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
అస్సాం: అస్సాంలో దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఛాత్ పూజ రోజు ఉదయం 6 నుంచి 8 వరకు కాల్చుకోవచ్చని తెలిపింది.
మధ్యప్రదేశ్: కాలుష్య స్థాయులు ఎక్కువగా ఉండటంతో మధ్యప్రదేశ్‌లో పటాకులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్టీటీ) నిషేధం విధించింది. అయితే గాలి నాణ్యత బాగున్న చోట ప్రజలు దీపావళి రోజు 2 గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని పేర్కొంది.
హర్యానా: జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే 14 జిల్లాల్లో అన్ని రకాల పటాకులపై హర్యానా ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. మిగతా 8 జిల్లాల్లో కూడా గతేడాది నవంబర్ డాటా ప్రకారం గాలి నాణ్యత చాలా తక్కువ ఉన్న పట్టణాలు, నగరాల్లో కూడా నిషేధం అమల్లో ఉంటుంది. గాలి నాణ్యత మధ్యస్థంగా ఉంటే గ్రీన్ క్రాకర్స్ అమ్మవచ్చు. వాటిని రాత్రి 8-10 గంటల మధ్యనే కాల్చాలి. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మకాలకు అనుమతి లేదు.