ఖైరతాబాద్, నవంబర్ 13: ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. తమకు గ్రామ పంచాయతీలో ఒక గది కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు, విధులు, అధికారాలు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రూ.500 కోట్లు ప్రకటించిందని తెలిపారు. నిధులు విడుదలచేయడంతోపాటు పలు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. సమావేశంలో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, ఉపాధ్యక్షులు మాణిక్‌రెడ్డి, ఫారూఖ్, విజయ్, సుధాకర్‌రెడ్డి, వెంకన్న, కోశాధికారి మన్నె రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.