Sruthi Hassan | కమల్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నటిగా, సింగర్‌గా అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. అయితే శృతి హాసన్ తన తండ్రి నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ కోసం ‘విన్వేలి నాయకన్’ అంటూ సాగే పాట పాడి అలరించింది. అర్ధవంతమైన సాహిత్యం, రెహమాన్ స్వర రచన, శృతి హాసన్ మెస్మరైజింగ్ వాయిస్ వలన ఈ పాటకి అశేష ఆదరణ లభిస్తుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కూడా ఈ పాటను స్టేజ్‌పై పాడి అదరగొట్టింది.
తన తండ్రి ముందు శృతి హాసన్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఈ రోజు థగ్ లైఫ్ రిలీజ్ సందర్భంగా తన అనుభూతిని అభిమానులతో పంచుకుంది శృతి హాసన్. థగ్ లైఫ్ చిత్రంలో పాట పాడడం నాకు జీవిత కాల అనుభవం. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తండ్రి మూవీలో పాట పాడే అదృష్టం ఎంత మంది కూతుళ్లకి దక్కుతుందో తెలియదు కాని నిజంగా నాకు ఇదొక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్. పాటను అద్భుతంగా ఆలపించానని రోజు వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. నేను నచ్చని వాళ్లు కూడా నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటివద్ద పియానో మీద ఈ పాట రిహార్సల్స్ చేశాను. రికార్డంగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. నా కెరీర్లో ఇది మెమోరబుల్ సాంగ్ అని శృతి పేర్కొంది.
కాగా, 2009లో కమల్ హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమాకి శృతి హాసన్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో రీమిక్స్ తో కలిపి ఐదు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయగా, అందులో మూడు పాటలను తనే స్వయంగా పాడింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ తన తండ్రి కోసం గళం విప్పిన ఈ ముద్దుగుమ్మ ‘విన్వేలి నాయకన్’ అంటూ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. థగ్ లైఫ్ చిత్రం నేడు విడుదల కాగా, మూవీకి మంచి టాక్ వచ్చింది.. లెజండరీ దర్శకుడు మణిరత్నం ఈ మూవీని తెరకెక్కించగా ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష, కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు.