హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం వెంటనే జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకపోతే లక్షలాది మందితో దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధిస్తామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కస్తూర్బా ఆడిటోరియంలో జాతి జనగణన సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సులో ఆయన ఇండియన్ నేషనల్ లీగ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మహ్మద్ సులేమాన్, మాజీ ఎంపీ రామ్బక్షిసింగ్ వర్మ తదితర ముఖ్యనేతలతో కలిసి హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జనగణనలో ప్రతి కులానికీ ప్రత్యేకంగా ఒక ‘యూనిక్ కోడ్’ కేటాయించి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం దేశంలోని అన్ని ఓబీసీ సం ఘాలు, ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. 80కోట్ల మంది బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని ఆపే ది లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లకు, హకుల సాధనకు స్పష్టమైన మద్ద తు ప్రకటించే రాజకీయ పార్టీలకే బీసీల మద్దతు ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి ఉద్యమాన్ని ఉధృతం చేసి, చివరికి ఢిల్లీ వేదికగా భారీ నిరసన చేపట్టాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.