హిమాయత్‌నగర్, అక్టోబర్ 4 : చట్టసభల్లో పద్మశాలీల ప్రాతినిధ్యం పెరిగితేనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. పద్మశాలీ విద్యార్థులు, ఉద్యోగులు అన్నిరంగాల్లో ప్రగతి సాధించి అగ్రగామిగా నిలువాలని పిలుపునిచ్చారు. నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో ఆదివారం రాత్రి ఇంజినీర్స్ డే వేడుకలు, విద్యార్థులకు కేరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, విదేశీ విద్యపై కౌన్సెలింగ్, గ్రూప్ సంభాషణవంటి అంశాలపై ప్ర త్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది.
అఖిల భారత పద్మశాలీ సంఘం ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పుట్ట పాండురంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రమణ హాజరై మాట్లాడుతూ పద్మశాలీలు కులవృత్తులకే పరిమితం కాకుండా రాజకీయ చైతన్యం పెంపొందించుకోవాలని సూచించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో అఖిలభారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, భావన రుషి బ్యాంక్ చైర్మన్ వనల శ్రీహరి, ఇంజినీర్స్ విభాగం ప్రధాన కార్యదర్శి మాసున మోహన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.