హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీని తొలగించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏ సర్వేలోనైనా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు అసహనానికి లోనవుతున్నారని విమర్శించారు. అందుకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేతలు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపేంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
సుదీర్ఘకాలం ఐపీఎస్ అధికారిగా సమర్థవంతంగా సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీని తొలగించడం శోచనీయమని వాపోయారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులకు ఆయన శత్రువుగా మారారని చెప్పారు. ఆయన బతికినంతకాలం భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ నివేదించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భద్రతను తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. ఆర్ఎస్పీ మావోయిస్టులు ప్రాబల్యం కలిగిన సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేశారని, తరచూ అక్కడికి వెళ్తుంటారని, ఆయన ప్రాణాలకు ముప్పుపొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కార్ చర్యను కోర్టులు సైతం ఒప్పుకోవని స్పష్టంచేశారు. ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎలాంటి ముప్పు లేని కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ ఇస్తున్నదని ఆరోపించారు. కానీ ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల భద్రతను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘మేం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకుల సెక్యూరిటీని తీసేస్తే ఇండ్లల్లో ఉండలేరు.. ఊర్లల్లో తిరుగలేరు..’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సెక్యూరిటీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీని తగ్గిస్తే ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించకపోవడంలోని ఔచిత్యమేంటని ప్రశ్నించారు. కొందరు అధికారుల తీరుతో వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్నదని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కలా ఇష్టానుసారంగా భూములు కొనుగోలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా ఐపీఎస్‌ల సంఘం బాధ్యులు స్పందించి ఆర్ఎస్ ప్రవీణ్‌కు అండగా నిలువాలని కోరారు.