రామనవమి అంటేనే.. పానకం, వడపప్పు. ఈ పర్వదినాన ఈ ప్రసాదాలను ప్రతిఒక్కరూ భక్తితో స్వీకరిస్తారు. అయితే, కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తే.. వడపప్పు, పానకం మరింత రుచికరంగా చేసుకోవచ్చు.
పానకం తయారీ కోసం నల్ల బెల్లం వాడితే.. అద్భుతమైన రుచితోపాటు రంగు కూడా బాగుంటుంది. బెల్లాన్ని గడ్డలుగా కాకుండా తురిమి వేస్తే త్వరగా కరుగుతుంది. ఆ తర్వాత నీటిని ఒకసారి వడకట్టాలి. అప్పుడే బెల్లంలో ఏవైనా ఇసుక, నలకలు ఉంటే తొలగిపోతాయి. ఇక తయారీ సమయంలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మిరియాలు పొడి కన్నా.. అప్పటికప్పుడు మిరియాలను దంచి వేయాలి. అప్పుడే.. పానకానికి మరింత ఘాటు, రుచి వస్తుంది. పానకానికి చిటికెడు సొంఠి పొడి చేరిస్తే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాలకుల పొడిని జోడిస్తే.. మంచి సువాసన వస్తుంది.
వడపప్పు కోసం.. పెసరపప్పును ఎక్కువ సేపు నానబెట్టకూడదు. అలా అయితే.. పప్పు మెత్తగా అయిపోయి రుచి తగ్గుతుంది. 30-40 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. వడపప్పులో కొద్దిగా నిమ్మరసం పిండితే.. తాజాగా ఉంటుంది. రుచి కూడా పెరుగుతుంది. ఇక వడపప్పులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అవసరమైతే చిన్న కీరా దోసకాయ ముక్కలు కలిపితే.. శరీరానికి చలువ చేస్తుంది.