యాదాద్రి భువనగిరి, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి క్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నిర్వహిస్తున్న సప్తాహ్నిక పంచకుండాత్మక యాగం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నది. యాగంలో భాగంగా నాలుగో రోజైన గురువారం రుత్వికులు, వేద పండితుల మంత్రోచ్చారణతో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. బాలాలయంలో నృసింహుడి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు యాగాన్ని తిలకించి పునీతులవుతున్నారు. బాలాలయంలో ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలతో యాగ క్రతువును కొనసాగించారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, పూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. ప్రధానాలయంలోని శిలామయమూర్తులకు విశ్వంలోని శక్తిని ఆవాహన చేయడానికి వాటిని విశేష ద్రవ్యాలతో అర్పించిన నీటిలో ఉంచి ‘జలాధివాస’ ఉత్సవాన్ని నిర్వహించారు. 25 కలశాలతో శిలామూర్తులకు ‘పంచ వింశతి కలశ స్నపనం’ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు. ఈ పర్వాలన్నింటినీ పాంచరాత్ర ఆగమ శాస్ర్తానుసారంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధానార్చకులు నల్లంథిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
ప్రయోగాత్మకంగా లడ్డూల తయారీ…
నాలుగు రోజులుగా యాదాద్రిలో నిర్విఘ్నంగా సాగుతున్న పంచకుండాత్మక యాగాన్ని తిలకించేందుకు భక్తజనం పోటెత్తుతున్నది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ప్రసాదాలను అందించేందుకు దేవస్థానం సిద్ధమవుతున్నది. యంత్రాలతో లడ్డూలు తయారుచేసే ప్రక్రియను కొద్దిరోజులుగా ప్రయోగాత్మకంగా చేపట్టింది. గురువారం 150 కిలోల లడ్డూలను తయారుచేసి కౌంటర్లలో అందుబాటులో ఉంచారు. రద్దీకనుగుణంగా ఎన్ని లడ్డూలైనా అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
నేటి పూజలు..
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనములు, ఏకోనపంచాషట్ కలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతి. సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూలమంత్ర హవనములు, పంచామృతాధివాసం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహిస్తారు.